Kalvakuntla Kavitha elangana Jagruti Politics: కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో మళ్లీ తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సారి బీఆర్ఎస్ పార్టీ తరపున కాకుండా తెలంగాణ జాగృతి తరపున ఆమె రాజకీయంగా కీలకంగా అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇందు కోసం కార్యాచరణ కూడా ప్రకటించారు. లిక్కర్ స్కాంలో అరెస్టు అయి విడుదలైన తర్వాత రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ గురువారం అదానీ ఇష్యూ లో మోదీపై విమర్శలు గుప్పించారు. శుక్రవారమే జాగృతి సభ్యలతో సమావేశమై కార్యచారణ రూపొందించుకున్నారు.
భారత జాగృతి కాదు.. తెలంగాణ జాగృతినే !
తెలంగాణ ఉద్యమం సమయంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ఏర్పాటు చేశారు. సాంస్కృతికత యుద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విస్తృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా జాగృతి యాక్టివ్ గానే ఉంది. బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారు. తర్వాత తెలంగాణ జాగృతిని కవిత భారత రాష్ట్ర సమితితో పాటు భారత జాగృతిగా మార్చేశారు. తర్వాత సామాజిక అంశాలపై పోరాటం చేశారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతుగా ఢిల్లీలో ధర్నాలు చేశారు. అయితే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం లిక్కర్ కేసులో అరెస్టు కావడంతో జాగృతి కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుతోనే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు తన నివాసంలో కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించారు.
బీసీ రిజర్వేషన్లు పెంచాలని ఉద్యమం
జాగృతి పేరుతో గతంలో తన వెంట నడిచిన నేతల్ని మళ్లీ పిలిపించుకుని తన ఇంట్లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి తరపున బీసీ కమిషన్ కు త్వరలోనే నివేదిక సమర్పిస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేసేందుకు తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టింది. బీసీ కమిషన్ నియమించింది. కులగణనలో వచ్చే వివరాల ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని అంటోంది. కాంగ్రెస్ ఏం చెబుతోందో.. అదే చేయాలని డిమాండ్ చేస్తూ కవిత వినతి పత్రం ఇచ్చేందుకు రెడీ కావడం ఆమె రాజకీయ వ్యూహంలో భాగమని అంచనా వేస్తున్నారు.
Also Read: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహత్మక మౌనం దేనికి సంకేతం-సంక్రాంతి తర్వాత సమరమేనా?
బీఆర్ఎస్ ముద్ర లేకుండా జాగృతి పేరుతోనే రాజకీయం !
బీఆర్ఎస్ తరపున కవిత రాజకీయాలు చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. జాగృతి పేరుతో మాత్రం రాజకీయాలు చేయడం ఖాయమయిందని ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అదానీ విషయంలో మోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన ఆమె ఒక్క రోజులోనే యాక్టివ్ అయిపోయారు. బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకు రావడం లేదు. ముందు ముందు రాజకీయాలకు సంబంధం లేని విధంగా తమ పోరాటం ప్రకటించుకునేవిధంగా కవిత రాజకీయం ఉంటుందని అంచనా వేస్తున్నారు.