HYDRA Commissioner Ranganath Comments On Its Activities: అక్రమ నిర్మాణాల విషయంలో మానవత్వంతో ఆలోచిస్తే సమాజమంతా బాధపడాల్సి వస్తుందని.. కొన్నిసార్లు మనసును చంపుకొని పని చేయాల్సి వస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (HYDRA Commissioner Ranganath) అన్నారు. హైదరాబాద్‌లో (Hyderabad) శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు తొలగించడం సహా చెరువుల్లోకి కొత్త నిర్మాణాలు రాకుండా అడ్డుకోవడమే తమ బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులను పునరుద్ధరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదన్నారు. చెరువులో నీటి విస్తీర్ణం, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లు, విలేజ్ మ్యాప్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటాన్నామన్నారు.
'ఆ ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చేసింది'
'అమీన్‌పూర్ చెరువు తూములు మూసివేయడం వల్లే లేఅవుట్లు మునిగాయి. ఎఫ్‌టీఎల్ లెవల్ పరిగణనలోకి తీసుకుని చెరువులు సర్వే చేయిస్తాం. తప్పుడు అనుమతులు ఇచ్చినవి, అనుమతులు రద్దు చేసిన ఇళ్లను మాత్రమే హైడ్రా కూల్చివేసింది. అనుమతులు లేకుండా ఉన్న ఇళ్లు.. పెద్దవాళ్లనైనా, పేదలవైనా కూల్చక తప్పదు. కొంతమందిపై చర్యలు తీసుకోవడం వల్లే హైడ్రా చేసే పని అందరికీ తెలిసింది. ప్రజల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లపై అవగాహన వచ్చింది. దీనిపై చర్చ కూడా జరుగుతోంది. ఎఫ్‌టీఎల్ పరిధి నిర్ధారించాక ఏదైనా నిర్మాణం చేపడితే అలర్ట్ వస్తుంది. అక్రమ నిర్మాణాల నియంత్రణకు అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నాం. ఇప్పటివరకూ ఎన్నో ఆక్రమణలు జరిగాయి. ఇకపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశం. హైడ్రా పనితీరుతో ప్రజల్లో అవగాహన పెరిగింది. చెరువులు, ఆక్రమణలకు గురి కాకుండా స్థానికులు కూడా నిఘా పెడుతున్నారు.' అని రంగనాథ్ పేర్కొన్నారు.
చెరువుల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు చేపడతామని.. అవసరమైతే మేధావుల సలహాలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. బెంగుళూరులో ఎక్కడా కూడా చెరువుల్లో ప్రైవేట్ భూమి లేదని.. కేవలం అక్కడ ప్రభుత్వ భూముల్లోనే చెరువులు ఉన్నాయన్నారు. ఇక్కడి చెరువులకు బెంగుళూరు చెరువులకు కొన్ని తేడాలు ఉన్నాయని.. ఇక్కడికి వచ్చిన వారిలో కొందరు హైడ్రాతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపినట్లు చెప్పారు. కచ్చితంగా వారి అనుభవాన్ని వినియోగించుకుంటామని అన్నారు. ఇకపై నగరంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read: KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్