Monkeys Died In FCI Godam In UP: ఓ ఎఫ్‌సీఐ గోదాంలో పెద్ద సంఖ్యలో కోతులు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లోని (Hathras) ఎఫ్‌సీఐ గోదాంలో (FCI Godam) దాదాపు 145 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషయం బయటకు పొక్కకుండా సిబ్బంది అక్కడే వాటిని పూడ్చిపెట్టారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గోదాంలో కోతులు మృతి చెందిన ఘటనపై స్థానిక నేత హర్షిత్ గౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు తెలిసిన ఓ వ్యక్తి గోదాంలో పని చేస్తున్నారని.. కోతులను పాతిపెట్టిన విషయం ఆ ఉద్యోగి వల్లే తనకు తెలిసిందని చెప్పారు. 'ఈ నెల 9న ఆహారధాన్యాలకు చీడపీడలు రాకుండా రసాయనాలు పిచికారీ చేసిన తర్వాత ఆ కోతులు గోదాంలోకి ప్రవేశించి చనిపోయాయని ఆ ఉద్యోగి ద్వారా తెలిసింది.' అని పోలీసులకు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఉద్యోగులు పోలీసులకు చెప్పలేదని ఫిర్యాదులో ఆరోపించారు.


అటు, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్వాలి ఎస్‌హెచ్ఓ విజయ్ సింగ్ తెలిపారు. జీవహింస వ్యతిరేక చట్టంలోని నిబంధనల కింద వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. భారీ స్థాయిలో కోతుల మృతి వెనుక గల కారణాలను వెటర్నరీ వైద్యుల సాయంతో ఆరా తీస్తున్నామని అన్నారు. 


Also Read: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్- పది మంది మావోయిస్టులు మృతి