KTR Comments On Adani Issue: తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో (Telangana Bhawan) శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అదానీ అంశంపై మాట్లాడారు. అంతర్జాతీయంగా మళ్లీ అదనీ వ్యవహారం బయటపడిందని.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకూ ఇది వెలుగుచూసిందని అన్నారు. 'మా పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు అదానీ రాలేదు. కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండానే రేవంత్ రెడ్డి ఆయనకు రెడ్ కార్పెట్ పరిచారా.?. రూ.12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు అదానీకి అప్పగించేందుకు సీఎం యత్నించారు. స్కిల్ యూనివర్శిటీకి ఆయన రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. వ్యాపారవేత్తలు రూ.40 వేల కోట్ల విరాళాలు ఉచితంగా ఇవ్వరని రాహుల్ గాంధీ అన్నారు. జాతీయ పార్టీ అంటేనే ఓ విధానం ఉండాలి. అదానీతో చేసుకున్న ఒప్పందాలను కెన్యా రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవడం లేదు.?. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వంతో రద్దు చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి.' అని డిమాండ్ చేశారు.










'ప్రధాని పట్టించుకోలేదు'


అదానీపై కేసు పెట్టాలని.. జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు. 'అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడింది. అమెరికాలోని ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు వెలువరించింది. గతంలో హిండెన్‌బర్గ్ అనే సంస్థ కూడా అవకతవకలు జరిగినట్లు చెప్పింది. అదానీ అంశం కారణంగా అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట మసకబారింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి చాలామంది మధ్యతరగతి మదుపరులు నష్టపోయారు. అదానీ ఎన్నిసార్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నించినా మేము ఆయన్ను రానివ్వలేదు. ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. రాహుల్ గాంధీ అవినీతిపరుడు అన్న వ్యక్తికే ఎర్రతివాచీలు కాంగ్రెస్ పరిచింది. అదానీకి డిస్కంలు అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారు. తెలంగాణలో ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలియదా.?' అని కేటీఆర్ నిలదీశారు.


Also Read: Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు