AP Assembly Adjourned Indefinitely: ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyannapatrudu) సభను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. 10 రోజుల పాటు కొనసాగిన సభలో మొత్తం 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం లభించింది. మొత్తం 60 గంటల పాటు సభ కొనసాగినట్లు స్పీకర్ తెలిపారు. ఈ సమావేశాల్లో 120 మంది సభ్యులు ప్రసంగించినట్లు చెప్పారు. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సమావేశాల్లో చివరి రోజు 3 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. వీటిలో విశాఖ డెయిరీ అక్రమాలపై సభా సంఘం వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.


మరోవైపు, శాసనమండలి సైతం నిరవధికంగా వాయిదా పడింది. ఈ 2 సభలు ఈ నెల 11 నుంచి ప్రారంభం అయ్యాయి. అదే రోజున రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అటు, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఈ సమావేశాలను వైసీపీ బహిష్కరించింది. కేవలం శాసనమండలికే వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మండలిలో టీడీపీ, వైసీపీ సభ్యులు ప్రశ్నలు, సమాధానాలతో సభ దద్దరిల్లింది. 


శాసనమండలిలో 8 బిల్లులకు ఆమోదం


శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకు శుక్రవారం శాసనమండలి ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది.



  • గత ప్రభుత్వం చేసిన చెత్తపన్ను విధింపు చట్టాన్ని రద్దు చేసింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది.

  • గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది.

  • ఏపీలో సహజవాయు వినియోగం జీఎస్టీ పన్నును తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమోదం. ఏపీ హిందూ ధార్మిక, మత సంస్థలు దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది.

  • ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు ఆమోదం

  • ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 రద్దుకు ఆమోదం. పీడీ యాక్ట్ సవరణ బిల్లు 2024కు ఆమోదం తెలిపింది.


పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి ఆంజనేయులు


అటు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) కొత్త చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. PAC, పీయూసీ, అంచనాల కమిటీ ఎన్నిక కౌంటింగ్ పూర్తి కాగా.. కమిటీ సభ్యులను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఓట్లు వేయగా.. వైసీపీ ఈ ఎన్నికను బాయ్‌కాట్ చేసింది.


PAC కమిటీ సభ్యులు


పీఏసీ కొత్త చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. సభ్యులుగా నక్కా ఆనందబాబు, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, జయనాగేశ్వర్ రెడ్డి, లలిత కుమారి, శ్రీరామ్ రాజగోపాల్, విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. కాగా, అసెంబ్లీ ఆర్థిక కమిటీలో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి అసెంబ్లీలో కనీస సంఖ్యా బలం 18 ఉండాలి. అయితే, వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు ఉండడంతో 3 కమిటీలకు ముగ్గురు వైసీపీ సభ్యులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. అటు, ఎమ్మెల్యేల కోటాలో 9కి గానూ మొత్తం 10 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో పోలింగ్ నిర్వహించారు.


అంచనాల కమిటీ సభ్యులు


అఖిలప్రియ, బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు, కందుల నారాయణరెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, పార్థసారథి, సునీల్ కుమార్, ఏలూరి సాంబశివరావు, నిమ్మక జయకృష్ణ


ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ


ఆనందరావు, ఈశ్వరరావు, గిడ్డి సత్యనారాయణ, గౌతు శిరీష, కూన రవికుమార్, కుమార్ రాజా, బేబీ నాయన, తెనాలి శ్రావణ్, వసంత కృష్ణప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.


సీఎఫ్ఎంఎస్‌పై తొలిసారి కాగ్ నివేదిక


ఏపీ అసెంబ్లీలో కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంపై కాగ్ నివేదిక ఇచ్చింది. 2018 నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్లు స్పష్టం చేసింది. 2022 - 23లో ఏపీ రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని.. వ్యయం 26.45 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2021 - 22తో పోలిస్తే రెవెన్యూ లోటు రూ.8,611 కోట్లతో 405 శాతం పెరిగిందని పేర్కొంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.43,487 కోట్లు ఉన్నట్లు కాగ్ తెలిపింది.


Also Read: Chandrababu : ఐదోసారి సీఎంగా వస్తా - అసెంబ్లీలో చంద్రబాబు కామెంట్స్ - పవన్ కోరిక మేరకేనా?