Chandrababu Fifth Time : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తాను ఐదో సారి సీఎంగా వస్తానని ధీమా వ్యక్తం చేశారు. బడ్జెట్ కోసం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు ఆయన మాట్లాడారు.తన విజన్ గురించి మాట్లాడిన తర్వాత ఐదో సారి సీఎంగా వస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా తనకు ఇది నాలుగో టర్మ్ అని.. 4.0లో ఇప్పుడు మొదటి దశ మాత్రమే జరుగుతోందన్నారు. పాలనలో మరిన్ని సంచలనాత్మక మార్పులు వస్తాయన్నారు.
రెండు రోజుల కిందట అసెంబ్లీలో మాట్లాడిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో పదేళ్ల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పని తీరుపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చని ప్రశంసించారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్నని దగ్గర ఉండి నడిపిన తీరు అభినందనీయమని తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పవన్ కల్యాణ్ సీఎం కావాలని జనసైనికులు కోరుకోవడం సహజమే. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పవన్ సీఎం అవుతారని జనసైనికులు నమ్మకంతో ఉన్నారు. అయితే పవన్ మాత్రం రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఉందని అంటున్నారు. అందుకే చంద్రబాబు సీఎంగా ఆ తర్వాత కూడా మరో పదేళ్లు కొనసాగాలని ప్రకటించేశారు. చంద్రబాబు కూడా చంద్రబాబు 5.0 ఉంటుందని చెప్పారు. అంటే కూటమిలో ఎలాంటి కన్ ఫ్యూజన్ లేదని చెప్పడానికి ముఖ్య నేతలు కావాలనే ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
నిజానికి చంద్రబాబు 4.0 ఏర్పడి ఐదు నెలలే అయింది. వచ్చే ఎన్నికల గురించి వచ్చే ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన పనిలేదు. ఓటమి తర్వాత వైసీపీ పదే పదే ఇబ్బందులకు గరువుతూండటంతో పాటు జగన్ మోహన్ రెడ్డి ఇక రాజకీయంగా కోలుకోలేరన్న అభిప్రాయం బలంగా ఉండటంతో కకూటమి నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అనుకోవచ్చని అంటున్నారు.