Chief Of Staff Job Offer In Zomato: జొమాటోలో 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' ఉద్యోగం కోసం వివాదాస్పద రీతిలో అప్లికేషన్లను ఆహ్వానించిన ఆ కంపెనీ ఫౌండర్‌ & సీఈవో దీపిందర్ గోయల్‌ (Zomato CEO Deepinder Goyal), తన X ఖాతాలో మరొక ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ పెట్టారు. తన కంపెనీలో పని చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ 18,000 మంది దరఖాస్తు చేసినట్లు ప్రకటించారు. అంతేకాదు, రూ.20 లక్షల ఫీజు విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు.


"జొమాటోలో 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' ఉద్యోగం కోసం దరఖాస్తుల స్వీకరణను ముగించాం. మేము 18,000కు పైగా దరఖాస్తులు స్వీకరించాం" అని గోయల్ Xలో రాశారు. "లెర్నింగ్ ఆర్గనైజేషన్"ను సృష్టించాలన్న కంపెనీ ఉద్దేశానికి అనుగుణంగా ఉన్న అభ్యర్థులను గుర్తించడానికి, ఆ దరఖాస్తులను వచ్చే వారంలో వడపోస్తామని తెలిపారు.


గోయల్ తన ప్రైవేట్ మెసెజ్‌ల స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్‌ చేశారు. "రూ. 20 లక్షల ఫీజ్‌ను వసూలు చేయము. సరైన వ్యక్తికి జీతం చెల్లిస్తాము" అని ఒక X యూజర్‌కు గోయల్‌ రిప్లై ఇచ్చినట్లు ఆ స్క్రీన్‌ షాట్‌లో ఉంది.


రూ.20 లక్షల ఫీజ్‌ ఎందుకు?
జొమాటో సీఈవో, తన కంపెనీలో 'చీఫ్ ఆఫ్ స్టాఫ్'గా పని చేయడానికి ఒక సమర్థుడైన వ్యక్తి కావాలని Xలో కోరారు. "పూర్వ ఉద్యోగానుభవం అక్కర్లేదని, రెజ్యూమే పంపాల్సిన పని లేదని, 200 పదాల్లో కవర్‌ లెటర్‌ పంపితే చాలని, నేర్చుకునే మనస్థత్వం ఉన్న వ్యక్తి తమకు కావాలని" ఆ మెసేజ్‌లో రాశారు. అంతేకాదు, ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి తమ స్వచ్ఛంద సంస్థ ఫీడ్‌ ఇండియా (Feeding India)కు రూ. 20 లక్షలు విరాళంగా ఇవ్వాలని షరతు పెట్టారు. మొదటి సంవత్సరం మొత్తం జీతం లేకుండా ఉచితంగా పని చేయాలని, రెండో ఏడాది నుంచి ఆ వ్యక్తికి సంవత్సరానికి రూ.50 లక్షలకు పైగా వేతనం చెల్లిస్తామని కూడా చెప్పారు. ఈ జాబ్‌ పోస్టింగ్‌ వల్ల, RPG గ్రూప్ చైర్‌పర్సన్ హర్ష్ గోయెంకా సహా పరిశ్రమ ప్రముఖులు, నెటిజన్ల నుంచి విమర్శల బాణాలు దూసుకొచ్చాయి.


విమర్శలపై గోయల్‌ స్పందన ఇదీ..
ఆ విమర్శలపై, తాజాగా, గోయల్ స్పందించారు. "ఇది సాధారణ నియామక పోస్టింగ్‌ మాత్రం కాదు. కొంతమంది వ్యక్తులు విమర్శిస్తున్నట్లుగా, 'మాకు రూ.20 లక్షలు చెల్లించాలి' అనేది కేవలం ఒక ఫిల్టర్ మాత్రమే. ఫాస్ట్ ట్రాక్ కెరీర్‌లో అవకాశాలను అందిపుచ్చుకునే శక్తి ఉన్న వ్యక్తులను కనుగొనడం కోసమే ఆ ఫిల్టర్‌" అని బదులిచ్చారు.


డబ్బు కట్టడానికి సిద్ధపడిన దరఖాస్తుదారులను తిరస్కరించాలని కంపెనీ యోచిస్తోంది. "నిజంగా పని చేయాలన్న ఉద్దేశం, కొత్త విషయాలు నేర్చుకోవాలన్న మనస్తత్వం ఉన్న అభ్యర్థిని ఎంపిక చేస్తాం" అని గోయల్ వెల్లడించారు.


దీనిని ఒక అరుదైన ప్రయోగంగా అభివర్ణించిన గోయల్‌, 'ఉద్యోగం పొందడానికి కంపెనీకి డబ్బు చెల్లించడం' ఈ ప్రపంచంలో ఒక కట్టుబాటు కాకూడదని తాను నిజంగా ఆశిస్తున్నట్లు చెప్పారు. 


'చీఫ్ ఆఫ్ స్టాఫ్'గా ఎంపికై న అభ్యర్థి జొమాటోతో పాటు దాని అనుబంధ సంస్థలైన బ్లింకిట్‌ (Blinkit), హైపర్‌ప్యూర్‌ (Hyperpure), డిస్ట్రిక్ట్‌ (District), స్వచ్ఛంద సంస్థ ఫీడ్‌ ఇండియా (Feeding India) కోసం పని చేస్తారు.


మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!