What Can And Cannot Be Stored In Bank Lockers: దొంగతనం, అగ్నిప్రమాదం సహా ఇతర రిస్క్‌లు లేకుండా విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు వంటివాటిని భద్రంగా దాచుకోవడానికి బ్యాంక్ లాకర్లు ఒక పాపులర్ ఛాయిస్. లాకర్లు ఆ వస్తువులకు రక్షణ కల్పించడంతో పాటు వాటి యజమానులకు మనశ్శాంతిని అందిస్తాయి. అయితే, అద్దె కడుతున్నాం కదాని ఏది పడితే అది బ్యాంకు లాకర్‌లో దాచకూడదు. బ్యాంక్ లాకర్లలో ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదు అనే దానిపై కొన్ని స్పష్టమైన రూల్స్ ఉన్నాయి. లాకర్ అద్దెకు తీసుకున్న ప్రతి ఒక్కరు ఈ రూల్స్ పాటించాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంక్‌లు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల సైజుల్లో లాకర్‌లను అందిస్తున్నాయి. ఈ లాకర్ సైజ్‌ను బట్టి చెల్లించాల్సిన అద్దె మారుతుంది.
బ్యాంక్ లాకర్లలో దాచేందుకు అనుమతించిన వస్తువులు జాబితా:
ఆభరణాలు: బంగారం, వెండి, వజ్రాలు, ఇతర విలువైన లోహాలు
నాణేలు, బులియన్: బంగారం, వెండి కడ్డీలు, ఇతర లోహాలు
చట్టబద్ధమైన పత్రాలు: వీలునామాలు, దత్తత పత్రాలు, ఆస్తి పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్లు
ఫైనాన్షియల్ రికార్డ్‌లు: మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, షేర్ సర్టిఫికెట్లు, పన్నులు, బీమా పాలసీలకు సంబంధించిన పత్రాలు
బ్యాంక్ లాకర్లలో దాచకూడని వస్తువుల జాబితా:
ఆయుధాలు, పేలుడు పదార్థాలు: తుపాకులు, పేలుడు పదార్థాలు, విస్ఫోటనం చెందే, ప్రాణాంతకమైన ఇతర రకాల వస్తువులు, పదార్థాలు
మాదక ద్రవ్యాలు, నిషేధిత పదార్థాలు: భారతదేశ చట్టాల ప్రకారం చట్టవిరుద్ధంగా పరిగణించే/ నిషేధించిన పదార్థాలు
పాడైపోయే వస్తువులు: ఆహారం లేదా కాలక్రమేణా పాడయ్యే లేదా చెడిపోయే వస్తువులు
హాని కలిగించే లేదా ప్రమాదకర పదార్థాలు: విషపూరిత, రేడియోధార్మికత కలిగిన పదార్థాలు; లాకర్‌కు, బ్యాంక్‌కు, చుట్టుపక్కల పరిసరాలకు, సిబ్బందికి, కస్టమర్లకు, ప్రజలకు హాని కలిగించే పదార్థాలు
నగదు: చాలా బ్యాంకులు తమ లాకర్లలో నగదు నిల్వను అనుమతించవు. ఎందుకంటే, ఇది అక్రమ ధనాన్ని (బ్లాక్ మనీ) ప్రోత్సహించడం అవుతుంది. అంతేకాదు.. నగదు పేపర్ కాబట్టి పాడయ్యే గుణం ఉంటుంది. వర్షం లేదా వరదల సమయంలో నీటిలో తడిచి పాడైపోవచ్చు, రంగు మారిపోవచ్చు, చెదలు పట్టొచ్చు, అగ్నిప్రమాదం జరిగితే కాలిపోవచ్చు. కాబట్టి, నగదు నిల్వ సురక్షితం కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే నగదుకు బీమా కూడా రాదు.
బ్యాంక్ లాకర్లలో ఏమి నిల్వ చేయవచ్చు, ఏవి నిల్వ చేయకూడదు అనే దానిపై ప్రతి బ్యాంక్ సొంతంగా రూల్స్ రూపొందించుకుంది. అయితే, మన దేశంలో ప్రతి బ్యాంక్ దాదాపుగా ఇవే నియమాలను అమలు చేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాల ప్రకారం లాకర్లను చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగించాలి. ఈ రూల్స్‌ను దాటి ప్రవర్తిస్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, జైలు శిక్ష కూడా పడొచ్చు.
మరో ఆసక్తికర కథనం: ప్రేమిస్తే జీతంతో పాటు బోనస్ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన కంపెనీ