Chinese Firm Announced Dating Reward For Employees : సాధారణంగా, అన్ని కంపెనీలు తన ఉద్యోగులు క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటాయి. తలెత్తకుండా, టైమ్ వేస్ట్ చేయకుండా, పక్కవాళ్లతో మాట్లాడకుండా పని చేయాలని చెబుతుంటాయి. ఒక చైనీస్ కెమెరా కంపెనీ మాత్రం తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రేమించడాన్ని (డేటింగ్) ఎంకరేజ్ చేస్తోంది. సక్సెస్‌ఫుల్‌గా డేటింగ్ చేస్తున్నవారికి నగదు ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది. ఆ కంపెనీ పేరు ఇన్‌స్టా360 (Insta360). మన పొరుగు దేశం చైనాలోని 'షెంజెన్' నగరంలో ఉంది.
ప్రేమిస్తే డబ్బే డబ్బు
ఇన్‌స్టా360 కంపెనీ, ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేసిన ప్రతి విజయవంతమైన పోస్ట్‌కు ఒక్కో ఉద్యోగికి 66 యువాన్లను (సుమారు రూ.750) బహుమతిగా ఇస్తోంది. అయితే, చైనీస్ డేటింగ్ ఫాట్‌ఫామ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒక ఉద్యోగి చైనీస్ డేటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా తనకు సరైన పార్ట్‌నర్‌ను కనిపెట్టి, వారితో కనీసం మూడు నెలల పాటు ప్రేమాయణం నడిపితే, ఆ ఇద్దరితో పాటు మ్యాచ్ మేకర్‌కు కూడా తలో 1,000 యువాన్లు రివార్డుగా ఇస్తామని కంపెనీ ఘనంగా ప్రకటించింది.
కంపెనీ ఉద్దేశం ఏంటి?
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, డేటింగ్ ఫోరమ్ ద్వారా ఉద్యోగుల శ్రేయస్సును ప్రోత్సహించాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఈ చర్య ద్వారా ఉద్యోగుల్లో 'కుటుంబ భావన & ఆనందాన్ని' పెంచడం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
సంస్థ ఈ సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 500 పోస్ట్‌లు విజయవంతమయ్యాయి, దాదాపు 10,000 యువాన్లు ఉద్యోగులకు రివార్డ్‌గా దక్కింది. ఈ డబ్బు వారి మ్యాచ్ మేకింగ్ ప్రయత్నాలకు ఉపయోగపడింది. అయితే, ఈ బంపర్ ఆఫర్ ప్రారంభించి ఇంకా మూడు నెలల కూడా కాలేదు కాబట్టి, కంపెనీ దీర్ఘకాలిక డేటింగ్ బోనస్‌లను ఇంకా పంపిణీ చేయలేదు.
చైనాలో పరిస్థితి ఇదీ..
జపాన్ లాగే చైనాలోనూ ఇటీవలి కాలంలో వివాహాలు, జననాల రేటు క్రమంగా తగ్గుముఖం పట్టింది. 2023లోని మొదటి మూడు త్రైమాసికాలతో (జనవరి-సెప్టెంబర్) పోలిస్తే, 2024 మొదటి మూడు త్రైమాసికాల్లో వివాహాల సంఖ్య 16.6 శాతం తగ్గిందని అధికారిక రికార్డులు చూపిస్తున్నాయి. ఇదే కాలంలో జననాల రేటు కూడా రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. 2023లో ప్రతి 1,000 మందికి కేవలం 6.39 జననాలు నమోదయ్యాయి, 2022లో ఈ నంబర్ 6.77గా ఉంది. ఈ నేపథ్యంలో, దేశంలో వివాహాలు, జననాల రేటును పెంచడానికి ఇన్‌స్టా360 కంపెనీ 'డేటింగ్'ను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
కంపెనీ తీసుకున్న చొరవ పట్ల ఉద్యోగులలో మిశ్రమ స్పందన వచ్చింది. "నా కంపెనీ మా అమ్మ కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది" అని ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో రాస్తే; మరొకరు "క్యాష్ రివార్డ్‌లు ఇవ్వడం సరైన మార్గమేనా?" అని ప్రశ్నించారు. అంటే, ప్రేమించడానికి డబ్బును ఎరగా వేస్తారా అనే అర్ధంతో ఈ కామెంట్ చేశారు. అయితే, సోషల్ మీడియా యూజర్లు మాత్రం ఈ వార్తపై భారీగానే ప్రతిస్పందించారు. ఆ కంపెనీ ఉద్యోగులు అదృష్టవంతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరో ఆసక్తికర కథనం: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్ కంపెనీ జోస్యం!