Gold Price Today: ప్రస్తుతం ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ (Wedding season 2024) నడుస్తోంది. బంగారం, వెండి మార్కెట్లలో సందడి నెలకొంది. నవంబర్ 18, 19, 20 తేదీలను పక్కన పెడితే, దీనికి ముందు చాలా రోజులు బంగారం ధరలు నిరంతరం తగ్గుతూ వచ్చాయి, రికార్డ్ గరిష్ట స్థాయుల నుంచి దిగి వచ్చాయి. ఈ కారణంగా కూడా బంగారం కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. అయితే, ఇప్పుడు ఆభరణాల కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం, బంగారం ధరల్లో భారీ పెరుగుదలను చూడబోతున్నాం.
గోల్డ్‌మన్ సాచ్స్ ఏం చెప్పింది?
బంగారం ధరలకు సంబంధించి గోల్డ్‌మన్ సాచ్స్ రిపోర్ట్ ప్రకారం, సెంట్రల్ బ్యాంకుల సపిడి కొనుగోళ్లు & అమెరికాలో కీలక వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా, వచ్చే ఏడాదిలో బంగారం సరికొత్త రికార్డు స్థాయికి చేరుకోవచ్చు. గోల్డ్‌మన్ సాచ్స్ 2025కి సంబంధించిన టాప్ కమోడిటీ ట్రేడ్‌లలో బంగారాన్ని చేర్చింది.
బంగారం 3,000 డాలర్లకు చేరుకోవచ్చు
సంవత్సరం తిరిగే సరికి, అంటే వచ్చే ఏడాది (2025) డిసెంబర్ నాటికి, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు 3,000 డాలర్లకు చేరుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. బంగారం కొనుగోళ్లు & స్వర్ణం నిల్వలపై ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు చూపుతున్న ఆసక్తిని బట్టి ఈ అంచనాకు వచ్చింది.
వచ్చే ఏడాది సంగతి అటుంచితే, ఈ ఏడాది కూడా బంగారం ధరలు భారీ పెరిగాయి. ఈ 3 రోజుల పతనాన్ని మినహాయించి, దాదాపు ఏడాది పొడవునా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
వాణిజ్య ఉద్రిక్తతలు కూడా ఒక కారణం
ట్రంప్ పరిపాలన కూడా బంగారం ధరల పెరుగుదలను సమర్ధించగలదని గోల్డ్‌మన్ సాచ్స్ పేర్కొంది. ఇది కాకుండా, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, US ఆర్థిక పరిస్థితిపై పెరుగుతున్న ఆందోళనల కారణంగానూ పసిడి రేట్లు ఆకాశాన్ని తాకవచ్చని లెక్కగట్టింది. ఈ రోజు (బుధవారం, 20 నవంబర్ 2024), గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2,641 డాలర్ల వద్ద ఉంది.
మన దగ్గర ఈ రోజు బంగారం ధర ఎంత?
మన దేశంలో ఈ రోజు కూడా గోల్డ్ రేట్లు హైజంప్ చేశాయి. హైదరాబాద్‌లో 1 గ్రాము (24 క్యారెట్లు) పసిడి రేటు రూ. 7,762 వద్ద ఉంది. ఆభరణాల ధర (22 క్యారెట్లు) 1 గ్రాము రూ. 7.115 పలుకుతోంది. కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 1,01,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా దాదాపుగా ఇవే రేట్లు అమలవుతున్నాయి.