Safe Investment Options For Conservative Investors: మన దేశంలో, రిస్క్‌ తీసుకునే పెట్టుబడిదారుల కంటే రిస్క్ లేని పెట్టుబడి మార్గాల్లో నడిచే సాంప్రదాయిక పెట్టుబడిదారుల సంఖ్య చాలా ఎక్కువ. సురక్షితమైన & భద్రతతో కూడిన సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్లను అన్వేషించే వాళ్లు ఎక్కువగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను (Fixed Deposit - FD) ఎంచుకుంటారు. ఇది, దశాబ్దాలుగా జనాదరణ పొందిన ఎంపిక. అయితే, చిన్న మొత్తాల పొదుపు పథకాలు (small savings schemes), పోస్టాఫీసు పొదుపు పథకాలు (post office savings schemes) వంటి ఇతర బెస్ట్‌ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.


సేఫ్‌ అండ్‌ సెక్యూర్‌ అనదగ్గ పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), నెలవారీ ఆదాయ ఖాతా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP), సుకన్య సమృద్ధి ఖాతా (SSA), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఉన్నాయి. FD తరహాలోనే ఈ సాధనాలు అత్యంత తక్కువ-రిస్క్‌తో, దాదాపు సున్నా రిస్క్‌తో ఉంటాయి. ముందుగా హామీ ఇచ్చిన రాబడిని అందిస్తాయి. అదనంగా, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు ప్రయోజనాన్ని (benefit of income tax exemption) అనుమతిస్తాయి.


పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund - PPF)


వడ్డీ రేటు: సంవత్సరానికి 7.1 శాతం
కనీస పెట్టుబడి: రూ. 500
గరిష్ట పెట్టుబడి: ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షలు
ఉపసంహరణ: ఐదేళ్ల తర్వాత విత్‌డ్రా అనుమతి ఉంటుంది. 4వ సంవత్సరం లేదా అంతకుముందు సంవత్సరం చివరన ఉన్న బ్యాలెన్స్‌లో ఏది తక్కువైతే అందులో 50 శాతాన్ని వెనక్కు తీసుకోవచ్చు.


నెలవారీ ఆదాయ ఖాతా (Monthly Income Account)


వడ్డీ రేటు: సంవత్సరానికి 7.4 శాతం
కనీస పెట్టుబడి: రూ. 1,000
గరిష్ట పెట్టుబడి: ఒక ఖాతాలో రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ. 15 లక్షలు
ఈ పథకం పెట్టుబడిదారులకు నెలనెలా ఆదాయాన్ని అందిస్తుంది.


సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizens Savings Scheme - SCSS)


వడ్డీ రేటు: సంవత్సరానికి 8.2 శాతం
పెట్టుబడి పరిమితి: గరిష్టంగా రూ. 30 లక్షలు
సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం అధిక వడ్డీ ఆదాయాన్ని, రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ను అందిస్తుంది.


పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా (Post Office Savings Account)


వడ్డీ రేటు: సంవత్సరానికి 4 శాతం
కనీస పెట్టుబడి: రూ. 500
ఈ పథకంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు వెనక్కు తీసుకోవచ్చు. 


పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (Post Office Recurring Deposit Account)


వడ్డీ రేటు: సంవత్సరానికి 6.7 శాతం
కనీస పెట్టుబడి: నెలకు రూ. 100
ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. మీకు వీలైనంత మొత్తాన్ని వీలైనప్పుడల్లా డిపాజిట్‌ చేయొచ్చు.


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate - NSC)


వడ్డీ రేటు: సంవత్సరానికి 7.7 శాతం (చక్రవడ్డీ ప్రయోజనం)
కనీస పెట్టుబడి: రూ. 1,000
పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు. పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. దీర్ఘకాలిక పొదుపు కోసం ఉత్తమ సాధనం.


కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra - KVP)


వడ్డీ రేటు: సంవత్సరానికి 7.5 శాతం (చక్రవడ్డీ ప్రయోజనం)
కనీస పెట్టుబడి: రూ. 1,000
పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్. హామీతో కూడిన రాబడిని అందిస్తుంది.


సుకన్య సమృద్ధి ఖాతా (Sukanya Samriddhi Account - SSA)


వడ్డీ రేటు: సంవత్సరానికి 8.2 శాతం
కనీస పెట్టుబడి: రూ. 250
గరిష్ట పెట్టుబడి: సంవత్సరానికి రూ. 1.5 లక్షలు
ఆడపిల్ల పేరిట పొదుపులను ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని తీసుకొచ్చారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాలను అందిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌