DRG Jawans Danced After Killing Naxals In Chhattisgarh: ఛత్తీస్‌గడ్‌లోని (Chhattishgarh) సుక్మాలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది నక్సల్స్ మృతి చెందారు. బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ పీ.సుందర్‌రాజ్ తెలిపారు. అయితే, నక్సలైట్లను మట్టుపెట్టిన అనంతరం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు సంబరాలు చేసుకున్నారు. మావోయిస్టులను మట్టుపెట్టిన ఆనందంలో చిందులు వేశారు. గన్నులు పట్టుకుని గుంపులుగా గిరిజన తెగల స్టైల్‌లో నృత్యం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం శుక్రవారం ఉదయం తుపాకుల మోతతో దద్దరిల్లింది. నిఘా వర్గాల సమాచారంతో సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య భీకర కాల్పులు జరిగాయి. కొరాజ్‌గూడ, దంతేస్పురం, నాగారం, బందార్పదార్ గ్రామాల్లోని అటవీ ప్రాంతాల్లో కొంటా, కిస్టారం ఏరియా కమిటీ నక్సల్స్ సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక దళాలు ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు నక్కి ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. వీరిని చూసి నక్సల్స్ కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది సైతం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో 3 ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా రిజర్వ్ గార్డులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలు కూడా కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.