Top 10 News:


1. సమగ్ర కులగణనపై ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నారు. సర్వే బాధ్యత రాష్ట్ర ప్రణాళికశాఖకు అప్పగిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


2. ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌


తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీని ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 14 వరకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువుగా బోర్డు నిర్ణయించింది. నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో పరీక్ష జరగనుంది. కాగా పోస్టుల్లో 272 నర్సింగ్‌ ఆఫీసర్లు, 99 స్టాఫ్‌ ఫార్మాసిస్ట్‌ పోస్టులున్నాయి.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



3. పవన్ కల్యాణ్ పేరుతో జిల్లా అధికారి దందా..!
కాకినాడ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్‌  రవీంధ్రనాథ్ రెడ్డి పవన్ కల్యాణ్ పేరు చెప్పుకుని దందాలు చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాను పవన్ కు అత్యంత సన్నిహితుడినని.. ఆయన సిఫారసుతోనే వచ్చానని చెప్పి మైనింగ్, అటవీశాఖ అధికారులు సహా పలువురు వ్యాపారుల్ని బెదిరిస్తున్నారన్న వార్తలు సంచలనం రేపాయి. రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారం మరీ వివాదాస్పదంగా మారడంతో అంతర్గతంగా విచారణ చేయించారు. పవన్ కల్యాణ్‌తో పాటు  డిప్యూటీ సీఎం పేషీలోని ఉన్నతాధికారుల పేర్లను కూడా ఉపయోగించి దందాలు చేస్తున్నారని తేలింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



4. ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్
పండుగ సమయంలో వంటనూనెలతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ  ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే వంట నూనెలు అందించేలా చర్యలు చేపట్టింది. కిలో పామాయిల్ రూ.110, సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.124కే విక్రయించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఒకే రకమైన ధరల్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రేషన్ కార్డుపై రిఫైండ్ ఆయిల్‌ను గరిష్టంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలని నిర్ణయించారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


5.రఘురామ కేసులో కీలక పరిణామం
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత అదనపు ఎస్పీ ఆర్‌. విజయ్‌పాల్‌ ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. పరారీలో ఉన్న విజయ్‌పాల్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం విజయ్‌పాల్‌ విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన గుంటూరు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



6. జేసీ ప్రభాకర్‌రెడ్డితో ప్రాణహాని: పెద్దారెడ్డి


టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ జిల్లా ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటిదాకా పలుమార్లు తనను చంపేందుకు జేసీ ప్రయత్నించారు. జేసీ గూండాలకు ఎస్పీ సహాయ సహకారాలు ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెప్పాలని పెద్దారెడ్డి డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


7. జగన్మాతగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ
దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ జగన్మాత రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటితో ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. భక్తులను రాత్రి 11 గంటల వరకు ఆలయంలోకి అనుమతించనున్నారు. చివరి రోజు కావడంతో అమ్మవారి దర్శనానికి, మొక్కులు తీర్చుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలో నిలుచున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..



8. గూడ్స్‌ రైలును ఢీకొట్టిన ఎక్స్‌ప్రెస్‌ రైలు
తమిళనాడులోని చెన్నై- సుళ్లూరుపేట మధ్యలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ప్రయాణికులు ఉన్న భాగమతి ఎక్స్ ప్రెస్  రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల రైలులోని కొన్ని బోగీలు పట్టాల తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  లైన్ క్లియర్ కాని కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లు రద్దు చేసింది.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


9. తెలుగు రాష్ట్రాలో భారీ వర్షాలు
రానున్న ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. దీంతో నేటి నుంచి కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


10. తిరుచ్చి ఎయిర్‌‌పోర్టులో టెన్షన్‌.. టెన్షన్‌..


తిరుచ్చి నుంచి షార్జా వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలోని హైడ్రాలిక్ వ్యవస్థలో లోపాన్ని గుర్తించిన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కాగా, గంటన్నరకు పైగా విమానం గాల్లోనే చక్కర్లు కొడుతుంది. విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరుచ్చి ఎయిర్ పోర్ట్‌కు పెద్ద సంఖ్యలో పారా మెడికల్ సిబ్బంది, 20 ఫైర్ ఇంజన్లు, 20 అంబులెన్స్‌లు చేరుకున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..