AP Government Supplies Cooking Oil With Less Prices: పండుగ సమయంలో వంటనూనెలతో పాటు కూరగాయల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే వంట నూనెలు అందించేలా చర్యలు చేపట్టింది. శుక్రవారం నుంచి కిలో పామాయిల్ రూ.110, సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.124కే విక్రయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) వంట నూనె సప్లయర్లు, డిస్ట్రిబ్యూటర్లను కోరగా.. వారు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే, ఇండోనేషియా, మలేషియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజీ ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగినట్లు మంత్రి నాదెండ్లతో సమావేశంలో వ్యాపారులు వివరించారు. ఈ క్రమంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ ఒకే రకమైన ధరల్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రేషన్ కార్డుపై రిఫైండ్ ఆయిల్‌ను గరిష్టంగా రూ.124కు, పామాయిల్‌ను రూ.110కు విక్రయించాలని నిర్ణయించారు. ఈ ధరలు శుక్రవారం నుంచి ఈ నెలాఖరు వరకూ అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామాయిల్, ఒక లీటర్ సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా, పండుగల వేళ సామాన్యులకు భారీ షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం వరకూ పెంచేయడంతో.. సన్ ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్‌పై ఇంపోర్ట్ ట్యాక్స్ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి చేరింది. అయితే, దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తోన్న క్రమంలో రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. కానీ, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపుతో వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. అన్ని రకాల వంట నూనెల ధరలు లీటరుపై ఒక్కసారిగా రూ.15 - రూ.20 వరకూ పెరిగాయి. దీంతో వంట నూనెలు అందించేలా సర్కారు చర్యలు చేపట్టింది.
రైతు బజార్ల తనిఖీ
అటు, ప్రజలకు విక్రయించే సరుకుల నాణ్యత, ధరలపై విజయవాడలోని రెండు రైతు బజార్లను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురునానక్ కాలనీ, పంటకాలువ రోడ్డులోని రైతు బజార్లను ఆయన పరిశీలించారు. వంటనూనెలు, ఉల్లి, టమాటా విక్రయాలపై వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. లీటర్ పామాయిల్ రూ.110, సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.124కి విక్రయించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతు బజార్లలోని దుకాణాల వద్ద ధరలు సూచిక బోర్డులను అప్పటికప్పుడే ఏర్పాటు చేయించారు. అక్కడ కూరగాయల నాణ్యతను సైతం పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఆయిల్ విక్రయించాలని.. నాణ్యత లేని ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. పండుగ వేళ ప్రభుత్వ చర్యలపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధరల తగ్గుదలతో కాస్త ఉపశమనం కలుగుతుందని అన్నారు.
Also Read: Vijayanagaram News: ఎస్పీ బాలు పాటలు వినిపిస్తూ వృద్ధురాలికి సర్జరీ - విజయనగరం జిల్లా వైద్యుల ఘనత