Job Notification In Telangana Medical Department: తెలంగాణలో వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు (Medical Recruitment Board) నోటిఫికేషన్ విడుదల చేసింది. 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులకు ప్రకటన విడుదలైంది. కాగా, గత నెలలో విడుదల చేసిన ఫార్మాసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు బోర్డు తెలిపింది. గత నెలలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అదనంగా మరో 272 పోస్టులను జత చేసింది. ఈ క్రమంలో మొత్తం భర్తీ చేయనున్న నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 2,322కు చేరాయి. ఈ నెల 14లోగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవాలని.. నవంబర్ 17వ తేదీన ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.


అలాగే, గత నెలలో 633 ఫార్మసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలుపుతూ తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య 732కు చేరగా.. వీటికి సంబంధించి ఈ నెల 21 వరకూ దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 30వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని బోర్డు ప్రకటించింది.


గ్రూప్ - 3 ఉద్యోగాలపై కీలక అప్ డేట్


మరోవైపు, రాష్ట్రంలో గ్రూప్ - 3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే వెల్లడించింది. తాజాగా దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అలాగే, మోడల్ ఆన్సర్ బుక్ లెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కమిషన్ పేర్కొంది. కాగా, మొత్తం 1,388 గ్రూప్ - 3 పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత 2022, డిసెంబర్ 30వ తేదీన 1363 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయగా.. తర్వాత మరో 13 పోస్టులను అదనంగా చేర్చారు. బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న 12 పోస్టులు, అనంతరం నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 1388కి పెరిగాయి.


Also Read: Young India Integrated Residential Schools: తెలంగాణ వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటులో మరో ముందడుగు- భూమిపూజాలో మంత్రుల కీలక వ్యాఖ్యలు