Breaking News Live: తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం - ధాన్యం కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి నిర్వహించాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం మొదలైంది. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న ధాన్యం కొనుగోలు అంశంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇదే కాక మరో 14 అంశాలపైన కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. జీవో నెంబరు 111 పైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Akbaruddin Owaisi Case Verdict: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ వ్యవహారం జరిగింది. మజ్లిస్ - ఏ- ఇత్తేహాదుల్ - ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) చేసిన వ్యాఖ్యలు అత్యంత దుమారం రేపాయి. ఆ మాటలు రెండు మతాల మధ్య నిప్పు రాజేశాయి. ఎంతగా అంటే, ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ వ్యవహారంలో ఇప్పుడు ఎట్టకేలకు నాంపల్లి కోర్టుతుది తీర్పు ఇవ్వనుంది.
Janasena Rythu Bharosa Yatra: గొట్లూరులో కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం
అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ధర్మవరం నియోజవర్గం గొట్లూరులో మైనార్టీ వర్గానికి చెందిన కౌలు రైతు నిట్టూరు బాబు కుటుంబాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బాబు వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాబు మరణం తరువాత తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ తరఫున రూ. లక్ష ఆర్ధిక సాయాన్ని పవన్ కళ్యాణ్ .. రైతు భార్య మల్లికకు అందజేశారు. ఈ సందర్భంగా కుమార్తెలు ఇద్దరిని పలకరించి, వారి చదువుల గురించి ఆరా తీశారు పవన్. ఆర్ధిక ఇబ్బందులు నేపథ్యంలో వారి చదువులకు ఎటువంటి ఆంటకం ఏర్పడకుండా జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
‘‘కేసీఆర్ కాలక్షేపం, కబుర్లు కట్టిపెట్టి ధాన్యం కొనుగోళ్లపై ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం చేయాలి. 24 గంటల్లో కొనుగోలు కేంద్రాలు తెరవాలి. లేనిపక్షంలో కాంగ్రెస్ సారథ్యంలో రైతులను కూడగట్టి టీఆర్ఎస్ నేతలను గ్రామాలకు రాకుండా తరిమికొడతాం.’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
AP Minister Ambati Rambabu: కడప జిల్లా వేంపల్లి.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నివాళులర్పించారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత వైయస్సార్ ఆశీస్సుల కోసం ఇడుపులపాయ వచ్చాను. రామారావు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు సారా నిషేధంపై ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాను. అప్పటి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి సాగునీరు అందించాలన్నదే వైఎస్సార్ ధ్యేయం. పోలవరం ప్రాజెక్టు వైయస్సార్ కల అయితే వైఎస్ జగన్‌కు ధ్యేయం. ఇలాంటి కీలక దశలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నాకు ఈ పదవి ఇచ్చారు అని అంబటి రాంబాబు అన్నారు.
అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకే రామకృష్ణ గారి కుటుంబ సభ్యులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించారు. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయం ఆయన భార్య సాకే సుజాతకు అందజేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు గారు, చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి.సి. వరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామకృష్ణ చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని జనసేనాని పవన్ కళ్యాణ్ కి సుజాత తెలిపారు. అంతకుముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
అధిక రద్దీ కారణంగా రేపు అనగా బుధవారం నుండి ఆదివారం వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. 5 రోజులు విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారని భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని టీటీడీ పీఆర్వో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కౌలు రైతు భరోసా యాత్ర కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, చేనేత వికాశ విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్ తదితరులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విమానాశ్రయం నుంచి కొత్తచెరువులో ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించడానికి బయల్దేరారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి నేడు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర రానున్నారు. స్వరూపానందేంద్రతోపాటు ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వరూపానందేంద్ర మంగళవారం వైజాగ్ ఎయిర్ పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఉదయం 9 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.30కు యాదగిరిగుట్ట గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. 10.45కు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. 11 గంటల నుంచి ఆలయాన్ని పరిశీలిస్తారు. 11:50కు యాదమహర్షి విగ్రహాన్ని సందర్శిస్తారు. అక్కడే మీడియాతో మాట్లాడి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్‌లో ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీ అరవింద్ ఇంటి ముందు ట్రాక్టర్‌తో రైతులు వడ్లు పోశారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
Background
దక్షిణ బంగాళాఖాతం నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో మరో రెండు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనుడగా, కొన్ని జిల్లాల్లో ఎండలతో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అలర్ట్ చేశారు. దక్షిణ బంగాళాఖాతంలో మార్పుల ప్రభావంతో ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి. ఏపీ, యానాంలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం నేడు కూడా చల్లగా ఉంటుంది. దక్షిణ బంగాళాఖాత నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఈ ప్రాంతాల్లో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నేడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ.. (AP Temperature Today)
రాయలసీమలో, దక్షిణ కోస్తాంధ్రలో ఉక్కపోత, వేడి మరింత పెరగనుంది. ఈ రోజు రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 41 డిగ్రీల దాక నమోదు కానున్నాయి. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నిన్న కొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. నేటి నుంచి సీమలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
బంగాళాఖాతం నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావం తెలంగాణలో కొన్ని జిల్లాలపై ఉంది. హైదరాబాద్ వాసులకు మాత్రం ఎండల నుంచి ఏమాత్రం ఊరట లభించడం లేదు. నిన్న సైతం 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, వేడి ఉక్కపోత అలాగే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ లో 41.3 డిగ్రీలు, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో రెండు రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు స్పష్టం చేసింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -