Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీని ఫార్ములా-ఈ కేసు షేక్ చేసింది. దీనిపై చర్చకు పట్టుబట్టిన బీఆర్‌ఎస్ సభలోనే నిరసన చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. సభ ప్రారంభం నుంచే బీఆర్‌ఎస్ సభ్యులు ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్చకు పట్టుబట్టారు. సభకు వస్తూనే కేసుపై నిరసన చేస్తూ వచ్చారు. కేటీఆర్ పై పెట్టిన కేసు అక్రమమని నినాదాలు చేశారు. అందుకు నిరసనగాా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు.
పొంగులేటి ఆగ్రహం
ప్రశ్నోత్తరాల తర్వాత భూభారతి బిల్లుపై చర్చను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ధరణి పోర్టల్ ద్వారా అప్పటి ప్రభుత్వ పెద్దలు భారీగా కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. ఈ పోర్టల్ వల్ల సామాన్యులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. వాటన్నింటినీ గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రజలకు మేలు చేసే చట్టం తీసుకొస్తామని చెప్పామన్నారు. అందుకే ఇన్ని రోజులు వివిధ వర్గాల నుంచి సమాచారన్ని తీసుకొని భూభారతి చట్టం రూపొందించినట్టు తెలిపారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగమయ్యారని వివరించారు. ఇది భూమి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చుట్టం అవుతుందన్నారు పొంగులేటి.
దొర చట్టానికి ప్రజలు బలి: పొంగులేటి
చర్చ సందర్భంగా కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పొంగులేటి. ఈ దేశంలో భూ సంస్కరణలు చేసిన పీవీ నర్సింహారావు. బూర్గుల రామకృష్ణారావు కొండా వెంకటరంగారెడ్డి స్పూర్తితో దేశానికి రోల్ మోడల్‌గా ఉండే చట్టాన్ని తీసుకొచ్చామన్నారు పొంగులేటి. గత పాలకులు ప్రజల క్షేమాన్ని మరిచిపోయి తమకు తోచినట్టు నాలుగు గోడల మధ్య కూర్చొని చట్టాలు చేశారని విమర్శించారు. దొర చేసిన తప్పునకు చాలా మంది పేద రైతులు బలైపోయి ప్రాణాలు తీసుకున్నారని మండిపడ్డారు.
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ఈ సందర్భంగానే సభలో గొందరగోళం నెలకొంది. కేటీఆర్‌పై పెట్టిన ఫార్ములా ఈ కేసుపై చర్చించాలని నినాదాలు చేస్తూనే ఉన్నారు. పొంగులేటి మాట్లాడుతున్న టైంలో మరింత బిగ్గరగా నినాదాలు చేశారు. ఆ క్రమంలోనే కొన్ని పేపర్లు చించి స్పీకర్‌పై వేయడంతో సభ ఆర్డర్ తప్పింది. బీఆర్‌ఎస్ చర్యలతో సీట్ల నుంచి లేచిన కాంగ్రెస్ సభ్యులు వారికి పోటీగా నినాదాలు చేశారు. ఇలా ఇరువర్గాలు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. వాటర్ బాటిళ్లు ఇసురుకున్నారు. పరిస్థితి గమనించిన స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
మీడియా పాయింట్ వద్ద విమర్శలు
అనంతరం మీడియా పాయింట్ వద్దకు వచ్చిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు, సభలో ఏం జరిగిందో వివరించారు. దళిత స్పీకర్‌ను బీఆర్‌ఎస్ నేతలు అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హరీష్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి స్పీకర్‌ను కొట్టేంత పని చేశారని ఆరోపించారు. వారి సభ్యతం ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ సభ్యులను ఎందుకు సస్పెండ్ చేయకూడదన్న కాంగ్రెస్
గతంలో ఇలా చేశారనే సంపత్, కోమటి రెడ్డిని సభ నుంచి బయటకు పంపించారని ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలను ఎందుకు బయటకు పంపించకూడదని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ నాయకులు కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ తమకు చెప్పులు చూపించారని ఆ వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దళిత ఎమ్మెల్యేలకు చెప్పులు చూపించిన శంకర్‌ను సస్పెండ్ చేయాలన్నారు. కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కేసు పేరుతో నాటకాలు ఆడుతున్నారని అన్నారు.
వీడియోలు బయటపెట్టాలంటున్న బీఆర్ఎస్
ఎవరు తప్పు చేశారో అసెంబ్లీ చర్చ పెట్టి తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. ఫార్ములా ఈ రేస్ కంటిన్యూ అయి ఉంటే టెస్లా వచ్చింది అన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ రేస్ వల్ల వేల మందికి ఉపాధి దొరికేది అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరిగేదని పేర్కొన్నారు. ఈ కేసుపై చర్చ జరిపే వరకు అసెంబ్లీలో పోరాటం చేస్తామన్నారు బీఆర్‌ఎస్ నేతలు.
మంత్రులకు సీఎం ఫోన్
అసెంబ్లీలో గొడవ జరిగిందని తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేశారు. అసలేం జరిగింది అని ఆరా తీశారు. సభలో జరిగిన గందరగోళాన్ని మంత్రులు ఆయనకు వివరించారు.
బీఆర్‌ఎస్‌పై పొంగులేటి ఆగ్రహం
సభ వాయిదా తర్వాత ప్రారంభమైనా బీఆర్‌ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఫార్ములా ఈ రేసింగ్‌పై చర్చ కావాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ గందరగోళంలోనే భూభారతిపై ప్రభుత్వం చర్చను కంటిన్యూ చేసింది. దీనిపై మరోసారి మాట్లాడిన పొంగులేటి భూ భారతిపై చర్చ జరగకుండా బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందన్నారు. వేల పుస్తకాలు చేదివిన వ్యక్తి సూచలు సలహాలు ఇస్తారనుంటే సభకు రాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన రాకపోకగా సభ్యులతో సభలో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి రౌడీయిజం చెల్లదని అన్నారు.
పొంగులేటి మాట్లాడిన తర్వాత బీఆర్‌ఎస్ సభ్యులకు స్పీకర్ అవకాశం ఇచ్చారు.వాళ్లెవరూ మాట్లాడకపోయేసరికి బీజేపీ సభ్యులతో మాట్లాడించారు. బీజేపీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ధరణిలో అన్ని అక్రమాలు జరిగాయని చెబుతున్న కాంగ్రెస్ విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మహేశ్వర్‌రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా సభ ఆర్డర్‌లోకి రాకపోవడంతో సభను మరోసారి స్పీకర్ వాయిదా వేశారు.
Also Read: ఏడాది కూలింగ్ పీరియడ్ ముగిసినట్లే - ఇక బీఆర్ఎస్ నేతలపై కేసుల వల - రేవంత్ మాస్టర్ స్ట్రోక్