KTR Comments On Formula Car Race Issue: తెలంగాణలో ఈ ఫార్ములా కార్ రేస్ (E Formula Car Race) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడే హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ 1 కోసం ప్రయత్నాలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలిపారు. ఇందుకోసం గోపన్‌పల్లిలో 580 ఎకరాల భూ సేకరణకు ప్రయత్నాలు చేశారని అన్నారు. అయితే, 2004లో ఓడిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టిందని చెప్పారు. తనపై ఏసీబీ కేసు నమోదు నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 


దేశంలో రేసుల కోసం పోటీ ఎప్పటి నుంచో ఉందన్నారు. ఈ కేసులో ఏమీ లేదని.. అసెంబ్లీలో చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలు ఈ కార్ రేసు కోసం పోటీ పడ్డాయని అన్నారు. 'హైదరాబాద్‌ను ఇన్నోవేషన్, రీసెర్చ్, మ్యానుఫాక్చరింగ్ హబ్ కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్ రేస్ నిర్వహించాం. తాము తొలుత ఫార్ములా - 1తో సంప్రదిస్తే వారు రామన్నారు. ఎన్నో తంటాలు పడి ఒప్పించాం. 2023లో ఫిబ్రవరిలో మేము నిర్వహించిన రేస్ చూసి కేంద్ర మంత్రులు, బడా పారిశ్రామిక వేత్తలు సైతం మెచ్చుకున్నారు. రేవంత్ సర్కార్ కుంభకోణం, లంబకోణం అని కేబినెట్‌లో ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారు.' అని కేటీఆర్ మండిపడ్డారు.


'అదే లక్ష్యంతో రేస్ నిర్వహించాం'


'నగరంలో ఈ కార్ రేస్ జరపాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. 4 కోట్ల ప్రజల మధ్య ఈ అంశంపై చర్చ పెట్టాలని అసెంబ్లీ స్పీకర్‌ను కోరాను. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంపై చర్చించే సత్తా ప్రభుత్వానికి లేదు. అక్రమాలు చేశామని సర్కారు అంటోంది. అవి నిరూపించకుండా లీకులిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. ఫార్ములా 1 రేస్ ట్రాక్ కోసం గోపన్‌పల్లిలో భూసేకరణ జరిగింది. అక్కడ సీఎం రేవంత్‌రెడ్డికి కూడా 15 ఎకరాల భూమి ఉంది. ఎఫ్ 1 చుట్టూ నగరాల అభివృద్ధి ఆధారపడి ఉంది. ఈవీ పాలసీ తేవాలి. భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అవుతుందన్న ఉద్దేశంతో ఫార్ములా ఈ కార్ రేస్ పెట్టాలని నిర్ణయించాం. ముందుచూపుతో ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు చేస్తాయి. చేయాలి. ఈ కార్ రేసింగ్ క్రెడిట్ పొందేందుకు బీజేపీ కూడా ప్రయత్నించింది. కేంద్రం సహకారంతోనే ఈ కారు రేసింగ్ జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. సచిన్, ఆనంద్ మహీంద్రాతో పాటు దేశంలోని చాలామంది ప్రముఖులు ఈ కార్ రేసింగ్‌ను ప్రశంసించారు. క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులను ఈ కార్ రేసింగ్ ఆకర్షించింది. ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం కలిపి ఈ రేస్ కోసం పెట్టిన ఖర్చు రూ.150 కోట్లు అయితే, దాదాపు రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది.' అని కేటీఆర్ వివరించారు.


'లగచర్ల చరిత్రలో నిలిచిపోతుంది'


తెలంగాణ చరిత్రలో లగచర్ల పేరు నిలిచిపోతుందని కేటీఆర్ అన్నారు. 'లగచర్ల కేసులో జైలు నుంచి విడుదలైన నరేందర్ రెడ్డి, 28 మంది రైతులకు శుభాకాంక్షలు. ఓ నిరంకుశ, మూర్ఖపు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం తప్పకుండా చరిత్రలో నిలిచిపోతుంది. లగచర్ల పేరు ఎప్పటికీ మర్చిపోరు. న్యాయవ్యవస్థ ద్వారా లభించిన ఈ విజయం కొడంగల్ రైతుల విజయం. మానసికంగా ఎంత చిత్రవధ చేసినా ఈ రోజు బెయిల్ సాధించుకొచ్చారు. నరేందర్ రెడ్డికి ఎన్ని అనారోగ్య సమస్యలున్నా రైతులను కాపాడాలని కోరారు.' అని కేటీఆర్ పేర్కొన్నారు.


Also Read: Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీ కేసులు