CM Revanth Reddy Anger On BRS MLAs In Assembly: గత ప్రభుత్వం తెచ్చిన 'ధరణి' పోర్టల్ అన్నదాతలకు భూములను దూరం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. విపక్ష పార్టీ అహంకారంతో వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా మర్యాదలను ఉల్లంఘించి గందరగోళం సృష్టిస్తున్నారని.. సభాపతిపైనే దాడి చేసే ధోరణిలో చర్చను అడ్డుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని.. ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి అని చెప్పారు. గులాబీ నేతలు రెచ్చగొట్టడం ద్వారా 'భూ భారతి' బిల్లుపై చర్చను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని అన్నారు. విపక్షాలు ఎంత రెచ్చగొట్టినా సభాపతి ఓర్పుతో వ్యవహరించారని.. ఏమాత్రం సహనం కోల్పోకుండా వాళ్లంతట వాళ్లే సహనం చచ్చిపోయి సహకరించాల్సిన పరిస్థితి కల్పించి సభను ముందుకు నడిపించారని ప్రశంసించారు.
'ఆత్మగౌరవం నిలబెట్టింది'
భూమి లేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టిందని సీఎం రేవంత్ అన్నారు. 'ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయి. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి మాత్రం అన్నదాతలకు భూములను దూరం చేసింది. 2010లో ఒడిశా కూడా ఇదే విధానాన్ని తెస్తే.. ఆ ప్రభుత్వం తప్పు చేసిందని ఎన్ఐసీ, కాగ్ సూచించాయి. అనుభవం లేని ఐ అండ్ ఎల్ఎఫ్ఎస్ సంస్థకు అప్పగించొద్దని హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం యువరాజుకు అత్యంత సన్నిహితుడైన గాదె శ్రీధర్‌రాజు కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణను అప్పగించారు.
క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న సంస్థలను ఎల్ఎఫ్ఎస్ సంస్థ టేకోవర్ చేసుకుంది. అవకతవకలకు పాల్పడిన సంస్థకు ధరణి పోర్టల్ బాధ్యతలను అప్పగించారు. ధరణి టెండర్ దక్కగానే ఈ సంస్థ పేరు, యాజమాన్యం మారింది. ఫాల్కన్ హెచ్‌బీ అనే పిలిప్పీన్ కంపెనీ, తర్వాత సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చాయి. 50 లక్షల మంది రైతులు, వారి భూముల వివరాలు ఈ సంస్థ చేతిలో పెట్టారు. ట్యాక్స్ హెవెన్ దేశాల కంపెనీల చేతిలో మన ధరణి పోర్టల్ పెట్టారు. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జీన్ ఐలాండ్ మీదుగా ధరణి పోర్టల్ తిరిగింది. పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా.. సీఈవోగా గాదె శ్రీధర్ రాజే ఉన్నారు.' సీఎం వివరించారు.
సభలో గందరగోళం
తెలంగాణ అసెంబ్లీని శుక్రవారం ఫార్ములా- ఈ కార్ రేస్ వ్యవహారం షేక్ చేసింది. దీనిపై చర్చకు పట్టుబట్టిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభలోనే నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్చకు పట్టుబట్టారు. సభకు వస్తూనే కేసుపై నిరసన చేస్తూ వచ్చారు. కేటీఆర్‌పై పెట్టిన కేసు అక్రమమని నినాదాలు చేశారు. అందుకు నిరసనగాా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు ప్రదర్శించారు. ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నేతల ఆందోళనతో మంత్రి పొంగులేటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చిల్లర వేషాలను ప్రజలు హర్షించరని మండిపడ్డారు.
Also Read: తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు