Viduthalai Part 2 Review Telugu: 2023లో వచ్చిన ‘విడుదల: పార్ట్ 1’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటివరకు కమెడియన్‌గా మాత్రమే పరిచయం ఉన్న సూరి ఈ సినిమాతో కథానాయకుడిగా మారారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు విడుదల అయింది. మొదటి పార్ట్‌లో కీలకపాత్రలో కనిపించిన విజయ్ సేతుపతి క్యారెక్టర్‌పై ఫోకస్ చేస్తూ తెరకెక్కించిన ‘విడుదల: పార్ట్ 2’ ఎలా ఉంది?
కథ: మొదటి భాగం చివర్లో మాస్టర్ అలియాస్ పెరుమాళ్‌ని (విజయ్ సేతుపతి) పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో పెరుమాళ్‌ని పోలీసులు విచారించడంతో రెండో భాగం ప్రారంభం అవుతుంది. పెరుమాళ్ పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి బయటకు పొక్కుతుంది. దీంతో అడవిలో ఉన్న మరో క్యాంపులోకి పెరుమాళ్‌ని షిఫ్ట్ చేసి అక్కడే ఎన్‌కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. అక్కడికి వెళ్లే దారిలో పోలీసులకు పెరుమాళ్ తన కథ చెప్పడం ప్రారంభిస్తాడు? సాధారణ స్కూల్ మాస్టర్ కరుప్పన్‌గా, పెరుమాళ్‌గా, మాస్టర్‌గా ఎలా మారాడు? తన జీవితంలో కేకే (కిషోర్), మహాలక్ష్మి (మంజు వారియర్) ఎలాంటి మార్పులు తెచ్చారు? చివరికి పెరుమాళ్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడా? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: చెప్పాల్సిన కథ నిజంగా పెద్దదిగా ఉంటే దాన్ని రెండు భాగాలుగా చెప్పడం మంచిదే. కానీ అంత పెద్ద కథ లేనప్పుడు రెండో భాగం తలకెత్తుకుంటే ప్రధాన కథలోని ఉప కథల మీద ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. ‘బాహుబలి’, ‘కేజీయఫ్’ సిరీస్‌ల్లోని రెండో భాగాల్లో కథ ఎంతగా ప్రోగ్రెస్ అవుతుందో మనం చూశాం. సెకండ్ పార్ట్ సరిగ్గా లేక ఫెయిల్ అయిన సినిమాలు కూడా చూశాం. వెట్రిమారన్ ‘విడుదల: పార్ట్ 2’ ఈ రెండు కేటగిరీలకు సరిగ్గా మధ్యలో ఆగిపోతుంది.
సినిమా చాలా ఇంట్రస్టింగ్‌గా ప్రారంభం అవుతుంది. గౌతమ్ మీనన్, విజయ్ సేతుపతిల మధ్య ఇంటరాగేషన్ సీన్, ఫ్లాష్‌బ్యాక్ ప్రారంభం కాగానే వచ్చే యాక్షన్ సీక్వెన్స్... ఇవన్నీ ప్రేక్షకుడు కథలో బాగా లీనం అయ్యేలా చేస్తాయి. అలాగే విజయ్ సేతుపతి, మంజు వారియర్‌ల మధ్య సాగే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్‌ను వెట్రి మారన్ చాలా మెచ్యూర్డ్‌గా రాశారు. శాంతియుతంగా సాగే ఉద్యమం హింసా మార్గం ఎలా పట్టిందనే పాయింట్ దగ్గర ఇంటర్వెల్ పడుతుంది.
సెకండాఫ్‌లో సినిమా చాలా వరకు క్లూలెస్‌గా మారిపోతుంది. విజయ్ సేతుపతి తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను చెబుతూ ఉంటారు. అందులో కూడా కంటిన్యుటీ ఉండదు. ముందు సీన్లో చనిపోయిన క్యారెక్టర్లు తర్వాతి సీన్‌లో కనిపిస్తూ ఉంటాయి. అది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చాలా సేపటికి అర్థం అవుతుంది. సినిమా ప్రారంభంలో చూపించిన ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్లకు ఒక అర్థం ఉంటుంది. వాతియార్ పాత్ర ఎందుకు నక్సలిజం బాట పట్టిందనేది చాలా ఎఫెక్టివ్‌గా చూపించారు. కానీ తర్వాత వచ్చే సీన్లకు కథతో అస్సలు సంబంధం ఉండదు. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ పోర్షన్లలో కొన్ని చిరాకు తెప్పిస్తాయి. కొన్ని సీన్లు, ఎపిసోడ్లు పూర్తిగా లేపేసినా ఓవరాల్ ఎఫెక్ట్ ఏమాత్రం తగ్గేది కాదు. ఇంకాస్త పెరిగేది కూడా.
క్లైమ్యాక్స్ షూట్ అవుట్ ఎపిసోడ్ చాలా లెంతీగా సాగుతుంది. చివర్లో పార్ట్ 3 లీడ్ లేకపోవడం చాలా పెద్ద రిలీఫ్. సూరి పాత్రకు ఇందులో పెద్ద ప్రాముఖ్యత లేదు. స్క్రీన్ టైమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అయితే గట్టిగా ఐదు నిమిషాలు కూడా సూరి కనిపించడు.
ఇళయరాజా అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయింది. పావురమా పాట వినడానికి చాలా బాగుంది. వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం నేచురల్ లొకేషన్లలోనే తీశారు. అది స్క్రీన్‌పై మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే... వాతియార్ పాత్రలో విజయ్ సేతుపతి బాగా నటించారు. ఇలాంటి పెర్ఫార్మెన్స్‌లు ఆయనకి కొత్తేమీ కాదు అలవాటైన రీతిలో చేసుకుంటూ వెళ్లిపోయారు. మహాలక్ష్మి పాత్రలో మంజు వారియర్ ఆకట్టుకుంటారు. మిగతా పాత్రధారులందరూ తమ క్యారెక్టర్ల పరిధి మేరకు నటించారు.
ఓవరాల్‌గా చెప్పాలంటే... మొదటి భాగం చూసి సెకండ్ పార్ట్ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది అనుకుంటే డిజప్పాయింట్ అవుతారు.