Pushpa 2 Worldwide Collections : ఇండియన్ సినిమా హిస్టరీలోనే సంచలనంగా మారింది 'పుష్ప 2' మూవీ. ప్రేక్షకుల ఆదరణ మాత్రమే కాదు, కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మూవీ రిలీజై రెండు వారాలు పూర్తి అయినప్పటికీ, ఇంకా ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొడుతుండడం విశేషం. 15వ రోజు ఈ సినిమా రూ.17.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ కలిపి 'పుష్ప 2' మూవీ రూ. 990 కోట్లకు పైగా రాబట్టింది.
'పుష్ప 2' డే 15 కలెక్షన్స్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదలైంది. నిజానికి ఇది తెలుగు సినిమానే. కానీ తెలుగుతో పోలిస్తే హిందీలో పుష్ప రాజ్ హవా ఎక్కువగా నడుస్తోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం, హిందీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'స్త్రీ 2' మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 15 రోజుల్లో 'పుష్ప 2' మూవీ మొత్తంగా రూ.990.7 కోట్లు వసూలు చేసింది. అందులో హిందీలో రూ.621.6 కోట్లు, తెలుగులో రూ.295.6 కోట్లు, తమిళంలో రూ.52.4 కోట్లు, మలయాళంలో రూ.13.97 కోట్లు, కన్నడలో రూ.7.13 కోట్లు వసూలు చేసింది. అయితే హిందీలో మాత్రమే విడుదలైన 'స్త్రీ 2' థియేట్రికల్ రన్‌లో రూ.598 కోట్లు వసూలు చేసింది. హాలిడే సీజన్ కావడంతో 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద మరికొన్ని రోజులు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంటుంది.
15వ రోజున 'పుష్ప 2' సినిమాకు తెలుగులో 18.93 శాతం ఆక్యుపెన్సీ ఉండడం విశేషం. హైదరాబాద్‌లో 481 షోలు పడగా, దాదాపు 23 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. ఇక బెంగళూరులో 459 షోలలో 10 శాతం ఆక్యుపెన్సీ ఉంది. హిందీలో 'పుష్ప 2' 17.43 శాతం ఆక్యుపెన్సీని చూసింది. ముంబైలో మాత్రం ఏకంగా 19.25 శాతం ఆక్యుపెన్సీతో 1152 షోలు పడ్డాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో 14 శాతం ఆక్యుపెన్సీతో 1572 షోలు ఉన్నాయి.
'బాహుబలి'కి ఎంత దూరంలో ఉందంటే?
'దంగల్', 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' సినిమాల తర్వాత 'పుష్ప 2' ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది. 'దంగల్' చైనాలో విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ. 2000 కోట్లు, 'బాహుబలి 2' రూ. 1788 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే 'పుష్ప 2' నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకారం ఈ మూవీ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1508 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే బాహుబలి రికార్డును బ్రేక్ చేయాలంటే పుష్పరాజ్ మరో రూ.280 కోట్లు రాబడితే చాలన్నమాట. అయితే 'పుష్ప 2' థియేట్రికల్ రన్ ముగిసే టైమ్ కు 'బాహుబలి' రికార్డు బ్రేక్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు. అయితే హిందీలో వరుణ్ ధావన్ 'బేబీ జాన్' మూవీ రిలీజ్ అవుతోంది. దీంతో హిందీలో 'పుష్ప 2' జోరుకు కొంతవరకు బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుంది.