ఆస్కార్ అంటే భారతీయులకు ఒకప్పుడు అందని ద్రాక్షగా, తీరని కలగా ఉండేది. ఆ కలను సాకారం చేసిన ఘనత మన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిది. ఆయన తీసిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చింది. దాని వెనక రాజమౌళి కృషిని మరువలేం. నాటు నాటుకు అవార్డు వచ్చిన తరువాత... ప్రతి ఏడాది ఆస్కార్ మీద సగటు భారతీయ ప్రేక్షకుడు దృష్టి మరింత పడింది. ఆస్కార్ బరిలో మన సినిమాలు ఏం ఉన్నాయని చూడడం మొదలుపెట్టారు.
ఆస్కార్ ముంగిట 'లాపతా లేడీస్'కు నిరాశ
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మాజీ భార్య దర్శకురాలు కిరణ్ రావు రూపొందించిన హిందీ సినిమా 'లాపతా లేడీస్' (Laapataa Ladies). ఈ ఏడాది మార్చి 1వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. సుమారు 5 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో దానికి ఐదు రెట్లు... అంటే రూ. 25 కోట్ల వరకు వసూలు చేసింది. ఆ కలెక్షన్లు పక్కన పెడితే అంతకు మించి ప్రశంసలు అందుకుంది. దర్శక రచయితలకు, నిర్మాతలకు గౌరవం తెచ్చింది.
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో (Best International Feature Film - Oscars 2025) ఆస్కార్ అందుకునే అర్హత 'లాపతా లేడీస్' సినిమాకు ఉందని 'ది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' నియమించిన కమిటీ అభిప్రాయపడింది. భారత్ నుంచి అధికారికంగా 'లాపతా లేడీస్' సినిమాను ఆస్కార్స్ అవార్డులకు పంపింది. అయితే ఈ సినిమా ఆస్కార్స్ అందుకోవడం కష్టం. కష్టం కాదు ఆ మాటకు వస్తే కుదరదు. ఆ అవకాశాన్ని కోల్పోయింది.
ఆస్కార్స్ (ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్) 97వ ఆస్కార్ పురస్కారాల కోసం ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో నిలిచిన టాప్ 10 సినిమాల జాబితాను విడుదల చేసింది. తమ దగ్గరకు వచ్చిన నామినేషన్లను పరిశీలించి మొత్తం మీద పది సినిమాలను షార్ట్ లిస్ట్ చేసింది. అందులో మన ఇండియన్ సినిమా 'లపాతా లేడీస్'కు చోటు దక్కలేదు. ఒక విధంగా భారతీయ సినిమా అభిమానులను నిరాశకు గురి చేసే అంశం ఇది.
Also Read: సౌత్ కంటే డబుల్... హిందీలో మొదటి సినిమా 'బేబీ జాన్' కోసం రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
కిరణ్ రావు దర్శకత్వం వహించిన 'లాపతా లేడీస్' సినిమాను ఆవిడతో కలిసి ఆమిర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే ప్రొడ్యూస్ చేశారు. ఉత్తర భారతదేశంలోని సాంప్రదాయ వివాహ వ్యవస్థ నేపథ్యంలో తీసిన చిత్రమిది. వివాహ సమయంలో వధువు ముఖం కనిపించకుండా మేలి ముసుగు వేయడంతో ఏ విధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనేది చూపించడంతో పాటు అమ్మాయిలకు చదువు అవసరం లేదని కొంత మంది పెద్దలు భావించే తీరును సున్నితంగా ఎండగట్టారు.