ED Focus On KTR Formula E Case: మాజీ మంత్రి కేటీఆర్‌పై  నమోదు అయిన ఫార్ములా ఇ కేసు చుట్టూ అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇంత వరకు ఏసీబీ మాత్రం దీనిపై ఫోకస్డ్‌గా వర్క్ చేస్తుందని అంతా అనుకున్నారు. కాని ఇందులో 55 కోట్ల రూపాయల వ్యవహారం ఉన్నందున ఈడీ కూడా దృష్టి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. 


మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కె.టిఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద కేసు నమోదు చేసేందుకు సిద్దమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లో 2023 ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా ఇ రేస్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై కేటీఆర్ సహా ఇతరుల పాత్ర ఉందని అనుమానిస్తున్న ఈడీ కేసు నమోదు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నుంచి ఫార్ములా E ఆపరేషన్స్ (FEO)కి కోట్లు బదిలీ చేశారని తేల్చినట్టు సమాచారం. ఇలా బదిలీ చేయడానికి సరైన అనుమతులు తీసుకోలేదని అంటున్నారు. ₹55 కోట్లను అనధికారికంగా బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. 


Also Read: తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు


ఈ కేసులో కేటీఆర్‌ను ఎ-1గా పేర్కొంటూ ఇప్పటికే ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఫైల్ చేసింది. దీని ఆధారంగానే ఈడీ కూడా చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏసీబీ పేర్కొన్నట్టు ఇతర అధికారులపై కూడా ఈడీ దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. 


ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ ఏసీబీ నుంచి ఈడీ ఎఫ్‌ఐఆర్‌ కాపీ తీసుకోవడానికి ప్రక్రియ ప్రారంభించిందని తెలుస్తోంది. అనధికారికంగా ఈ కాపీని తీసుకున్న ఈడీ అధికారులు దీనిపై మంతనాలు చేస్తున్నారట. మొదట దీన్ని PMLA కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మరింత లోతుకు వెళ్లిన తర్వాత ఫెమా కింద కూడా కేసులు పెడతామంటున్నారట. 


హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఇ రేస్‌ కోసం కేటీఆర్ ఆదేశాల మేరకు ₹55 కోట్లను అధికారులు బదిలీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇలా బదిలీ చేయడం చట్టవిరుద్దమని ACB FIRలో పేర్కొంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై అనుమాం వ్యక్తం చేసిన ఆ రేస్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జరిగిన ఈవెంట్‌లో నిధులు దుర్వినియోగం,  అక్రమాలపై విచారణకు ఆదేశించింది. 


తీవ్ర చర్చోచర్చలు ఆధారంగా తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 12న కేటీఆర్, అరవింద్ కుమార్‌ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో ప్రభుత్వ సీఎస్‌ ఆదేశం మేరకు, మున్సిపల్ శాఖ ఫిర్యాదుతో ఏసీబీ విచారణ చేపట్టింది. 


ఈ కేసు చాలా విచిత్రమైందని అన్న కేటీఆర్‌ న్యాయపరంగానే దీన్ని ఎదుర్కొంటామని అంటున్నారు. ఇప్పటికే కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే అన్నారు. ప్రజాసమస్యల నుంచి ప్రజలను దృష్టిని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు న్యాయస్థానంలో నిలబడదని అంటున్నారు కేటీఆర్. 


Also Read: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్