Breaking News Live Telugu Updates: విశాఖ ఆర్కే బీచ్ లో ఇంటర్ విద్యార్థి గల్లంతు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
Visakha News : విశాఖ సాగర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గల్లంతయ్యాడు. ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగగా స్నేహితుల కళ్లముందే ఓ విద్యార్థి కొట్టుకుపోయాడు. వీరంతా నారాయణ కళాశాల విద్యార్థులుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై విద్యార్థి తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం గల్లంతైనప్పటికీ పోలీసులు ఇప్పటికీ ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదు. నారాయణ కాలేజ్ ఆసిల్ మెట్ట క్యాంపస్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జగదీష్ అనే విద్యార్థి ఆదివారం కావడంతో తోటి స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్ కు వెళ్లాడు. సరదాగా సముద్ర స్నానానికి దిగిన జగదీష్ స్నేహితుల కళ్లముందే సముద్రంలో గల్లంతయ్యాడు.
పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేసిన ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన నగర శివారు మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి శాస్త్రిపురం ఒవైసీ హిల్స్ లో ఇరువురు యువకుల మధ్య ఘర్షణ కాస్తా ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. మహ్మద్ సభ్దార్ , ఇజ్రాయిల్ అనే యువకుల మధ్య పాత కక్షల నేపథ్యంలో గొడవ జరిగింది. అదే ప్రాంతానికి మహ్మద్ సబ్దార్ అనే యువకుడు ఇజ్రాయిల్ అనే యువకుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఇజ్రాయిల్ సోదరుడైన నబీ అనే యువకుడు కత్తితో సబ్దార్ పై తిరిగి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సభ్దార్ అనే యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్‌లోని ఆర్యనగర్‌లో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఓ సూపర్ మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో మార్ట్ మొత్తం మంటలు వ్యాపించి మొత్తం కాలి బూడిదయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాదాపుగా రూ.కోటికి పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని యజమాని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తిరుపతి ఎంపీ గురు మూర్తి, తెలంగాణ ఎమ్మెల్సీ రేగ కాంతారావులు కుటుంబ సభ్యులతో కలసి వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు..
మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ బైక్‌ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలైన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక సాయినగర్ RRR Wines వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మియాపూర్ నుండి గండిమైసమ్మ వైపు వెల్తున్న బ్రీజా మారుతి కార్ లో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు మద్యం మత్తులో అతివేగంగా కార్ ను నడుపుతూ క్రవాహన దారుడిని వెనుక నుంచి గుద్దారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడ్ని బాచుపల్లిలోని మమత ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారకులైన యువకులు కార్ ను ప్రగతి నగర్ కమాన్ వద్ద వదిలి పారిపోయారు. కారులో 100 Pipers Liquor Bottle, Soda, Thumpsup Bottle, Glasses ఉండటంతో ఆ యువకులు మద్యం సేవించి ఉంటారని భావిస్తున్నారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Background
నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనుండగా... తెలంగాణలో ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం.
తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో ఆగస్టు 31 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో శనివారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురుస్తుందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఆగస్టు 29న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు..
హైదరాబాద్‌ను మేఘాలు కమ్మేశాయి. కానీ నగరంలో మోస్తరు వర్షం కురిసే అవకాశం లేదు. నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 23, గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలు నమోదైంది. వాయువ్యం, ఉత్తర దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ఆగస్టు 31 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. రేపు శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. యానాంతో పాటు విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని చెప్పారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మరో మూడు రోజులు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో తేలికపాటి జల్లుల పడతాయి.
రాయలసీమలో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సంభవిస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -