Minister Lokesh Comments In Visakha: ఐదేళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర కోసం జగన్ చేసిందేమీ లేదని.. కనీసం రైల్వే జోన్‌కు భూమి కూడా ఇవ్వలేదని, ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ధ్వజమెత్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్‌లో సమీక్ష అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. '2014 నుంచి ఎన్డీయే ప్రభుత్వ నినాదం ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని - అభివృద్ధి వికేంద్రీకరణ. ఇందులో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే పూర్తైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. రైల్వే జోన్ అందరి కల. జోనల్ హెడ్ క్వార్టర్ విశాఖలో ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఇవే కాకుండా రైల్వేకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.' అని పేర్కొన్నారు.
'ఐటీ కేంద్రంగా విశాఖ..'
విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని.. ప్రస్తుత పెట్టుబడుల ద్వారా దాదాపు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని లోకేశ్ తెలిపారు. 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. వైసీపీ ఫేక్ పార్టీ. ఉత్తరాంధ్రకు వైసీపీ ఐదేళ్లలో ఏం చేసింది?. ఒక్క ఐటీ కంపెనీ తీసుకురాలేదు. ఉన్న కంపెనీలు వెళ్లిపోయాయి. టీసీఎస్ మేం తీసుకువచ్చాం. రుషికొండ తప్ప వైసీపీ హయాంలో ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదు. మేం డేటాసెంటర్ తీసుకువస్తే మహారాష్ట్రకు తరిమేశారు. లులూ తరిమేశారు. హెచ్ఎస్‌బీసీ మూతపడింది. హుద్ హుద్, తిత్లీ తుఫాను, విజయవాడ వరదల సమయంలో సాయం ప్రకటించిన జగన్ రెడ్డి.. ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలి. రాష్ట్ర సమగ్రాభివృద్ధి మా నినాదం.' అని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో రూ.1000 పెన్షన్ పెంచామని లోకేశ్ అన్నారు. 'దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. దీపం పథకం అమలు చేస్తున్నాం. తల్లికి వందనం డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా తేదీలు ప్రకటించాం. మత్స్యకారులకు ఇస్తున్నాం. గత ప్రభుత్వ బకాయిలన్నీ మేం చెల్లిస్తున్నాం. ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.1800 కోట్లు బకాయిలు పెడితే మేం చెల్లిస్తున్నాం. మేం పారిపోవడం లేదు. ప్రతి నెల రూ.4వేల కోట్ల డెఫిసిట్‌తో బడ్జెట్ నడుస్తోంది. జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. వైసీపీ విధ్వంసం వల్లే ఇదంతా. పారిశ్రామిక వేత్తలను వైసీపీ ఇబ్బందులు పెట్టడంతో వారు పెట్టుబడులు పెట్టేందుకు భయపడుతున్నారు.' అని చెప్పారు.
'గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి'
గిరిజనులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. 'అరకు కాఫీని రూ.300 కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల బ్రాండ్‌కు తీసుకువెళ్తాం. గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. అదనంగా నిధులు కూడా కేటాయిస్తున్నాం. ప్లాంటేషన్‌ను కట్టడి చేస్తాం. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో ముందుకు వెళ్తున్నాం. బీసీల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎస్, డీజీపీ, టీటీడీ ఈవో బీసీ సామాజికవర్గాలకు అవకాశం కల్పించాం. మంత్రులందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. లోపాలు ఏవైనా ఉంటే ఓపెన్‌గా మాట్లాడుకుంటున్నాం. వైసీపీది దుష్ప్రచారం మాత్రమే. మేం పరదాలు కట్టుకుని తిరగడం లేదు. జగన్ సెక్యూరిటీతో పోల్చుకుంటే చంద్రబాబు గారిది 30 శాతమే.' అని పేర్కొన్నారు.