ISRO Operates Indias First Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ (Space Robotic Arm) సత్తా చాటింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO).. రీలొకేటబుల్ రోబోటిక్ మానిప్యులేటర్ - టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ (RRM - TD) పని తీరును సమర్థంగా పరీక్షించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకోగా వైరల్ అవుతోంది. డిసెంబర్ 30న స్పేస్ డాకింగ్ మిషన్‌కు సంబంధించిన 2 స్పెడెక్స్ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించింది. రాకెట్ నుంచి వేరైన ఈ 2 ఉపగ్రహాలు అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఈ 2 శాటిలైట్స్‌ను స్పేస్‌లో అనుసంధానించనున్నారు.
ఇదే కీలక ప్రక్రియ
ఈ స్పేస్ డాకింగ్ మిషన్‌కు సంబంధించి కీలక ప్రక్రియను ఇస్రో నిర్వహించింది. వాకింగ్ రోబోటిక్ ఆర్మ్‌గా వ్యవహరించే ఆర్ఆర్ఎం - టీడీ (RRM TD) పనితనాన్ని ఇస్రో పరీక్షించింది. బేస్ పొజిషన్ నుంచి అన్ లాక్ అయిన స్పేస్ రోబోటిక్ చేయి.. కొంతపైకి లేచి తిరిగి తన స్థితికి చేరుకుంది. మరోవైపు, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ (IISU) అభివృద్ధి చేసిన అంతరిక్ష రోబోటిక్ చేతిలో 7 కదిలే కీళ్లు ఉన్నాయి. పీఎస్ - 4 ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంట్ మాడ్యూల్ (POEM - 4) ప్లాట్‌ఫారమ్‌లోని నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోబోటిక్ ఆర్మ్ పని చేయనుంది.