Pune Man Find Knife In Pizza: ఇటీవల రెస్టారెంట్లు, హోటళ్లు, బయట ఫుడ్స్‌ల్లో బొద్దింకలు, చనిపోయిన కప్పలు, సిగరెట్ పీకలు కనిపించడం వంటి ఘటనలు చూశాం. రెస్టారెంట్లలో అధికారుల తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు వండుతున్నవి సైతం వెలుగుచూశాయి. తాజాగా, పిజ్జా ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. పిజ్జా తింటుండగా కత్తి ముక్కను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. పుణేకు చెందిన డోమినోస్ (Dominos) నుంచి అరుణ్ అనే వ్యక్తి పిజ్జా ఆర్డర్ చేశాడు. దాన్ని తింటుండగా.. తనకు ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. వెంటనే దాన్ని నోటి నుంచి తీసి పరిశీలించగా.. కత్తి ముక్కగా తేలింది. దీంతో కంగు తిన్న ఆయన సదరు పిజ్జా అవుట్ లెట్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు.


అయితే, తొలుత దీన్ని తోసిపుచ్చిన షాపు మేనేజర్ అనంతరం కస్టమర్ ఇంటికి వచ్చి పరిశీలించాడు. అరుణ్ తగిన ఆధారాలు చూపడంతో తప్పును అంగీకరించి క్షమాపణలు కోరాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. 'రూ.596తో పిజ్జా ఆర్డర్ చేశాను. దాన్ని తింటుండగా మధ్యలో పదునైన వస్తువు తగిలినట్లు అనిపించింది. పిజ్జాలో కత్తి ముక్క రావడం చూసి షాకయ్యాను. డోమినోస్ నుంచి ఇలాంటి సేవలు బాధాకరం. ఇది నిర్లక్ష్యం మాత్రమే కాదు. ప్రాణాలకు కూడా ప్రమాదకరం. మీరు ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత జాగ్రత్త వహించండి.' అని అరుణ్ పేర్కొన్నారు. కాగా, నెట్టింట ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read: OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ