OYO Rooms in India | న్యూఢిల్లీ: ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మీకు OYO హోటల్ కనిపిస్తే వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి ఈజీగా రూమ్ తీసుకునేవారు. కానీ ఇకనుంచి అందరికీ ఆ సర్వీస్ అందుబాటులో ఉండదు. పెళ్లికాని జంటలు ఇకపై చెక్ ఇన్ చేయడానికి అనుమతించకూడదని OYO నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మీరట్‌లో ఓయో కొత్త చెక్-ఇన్ పాలసీని తీసుకొచ్చింది. నూతన సంవత్సరం నుంచి ఓయో హోటల్స్ చెకిన్ విషయంలో కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.
చెక్ ఇన్ సమయంలో కఠిన నిబంధనలు
OYO తాజా చెక్ ఇన్ రూల్స్ ప్రకారం.. ఇక నుంచి పెళ్లికాని జంటలకు రూమ్ ఇవ్వడాన్ని నిలిపివేశారు. సవరించిన నిబంధనల ప్రకారం చెక్ ఇన్ సమయంలో అన్ని జంటలు వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. వారి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో కచ్చితంగా తెలిసేలా ఐడీలో వివరాలు కనిపించాలి. ఓయో హోటల్స్ పరిసరాలలో ఉండేవారు చేసే ఆరోపణలు, సామాజిక ధృక్పథానికి అనుగుణంగా పెళ్లి కాని జంటలకు గదులు నిరాకరించే విచక్షణాధికారాన్ని ఓయో హోటల్స్‌కు కంపెనీ కల్పించింది.
త్వరలోనే దేశ వ్యాప్తంగా కొత్త చెకిన్ పాలసీ
ప్రస్తుతానికి మీరట్‌లో సవరించిన చెక్ ఇన్ రూల్స్ అమలు చేస్తున్నారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా త్వరలోనే దేశ వ్యాప్తంగా ఓయో హాటల్స్ ఈ రూల్స్ అమలు చేస్తామని పేర్కొంది. ఓయో హోటల్స్ పై స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తరువాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని కోర్టుల్లో సైతం దీనిపై పిటిషన్లు వేయగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పెళ్లికాని ఓ మహిళ, పురుషుడికి ఎలా ఒకే గదిలో ఉండటానికి అనుమతి ఇస్తున్నారు, ఓయో ప్లాన్ ఏంటి అని పలు నగరాల్లో ఫిర్యాదులు రావడం తెలిసిందే.
న్యూ ఇయర్ సందర్భంగా భారీగా బుకింగ్స్
ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఒక్కరోజే మిలియన్ పైగా ఓయో రూమ్స్ బుకింగ్స్ జరిగాయి. అంటే వీటిని ఎలా వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారో ఓయో కంపెనీ అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఓయో నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస్ శర్మ పీటీఐతో మాట్లాడుతూ.. ‘చెప్పాలంటే OYO సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఆతిథ్యం ఇస్తుంది. ఇప్పటివరకూ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాం. కానీ పౌరులతో కలిసి మెరుగైన సేవలు ఇవ్వాలని భావించాం. ప్రజల నుంచి సలహాలు సేకరించి ఈ నూతన చెకిన్ విధానాన్ని తీసుకొచ్చాం. దీనిపై త్వరలోనే సమీక్షించి దేశ వ్యాప్తంగా అన్ని నగరాలలో అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నామని’ వెల్లడించారు.
విద్యార్థులు, వ్యాపార నిమిత్తం వచ్చేవారు, కుటుంబాల వెకేషన్, మతపరమైన కార్యక్రమాలు, ఒంటరి ప్రయాణీకులకు సురక్షితమైన గమ్యస్థానంగా ఓయోని నిలిపాం. మరింత మెరుగైన, సురక్షితమైన, ప్రజామోదయోగ్యమైన సేవల్ని అందించడానికి OYO గదులను కేటాయించే సమయంలో జంటలకు సంబంధించి పెళ్లి జరిగిందా, లేదా అని ఆరాతీసేలా చెక్ ఇన్ పాలసీ తీసుకొచ్చామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అనైతిక కార్యకలాపాలు జరగకూడదని, అలాంటి వాటిలో తాము భాగస్వాములుగా మారొద్దని భావించి ఓయో మేనేజ్‌మెంట్ పోలీసుల సలహాలు కోరింది. తప్పుడు మార్గాల్లో నడిచేవారికి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఓయో రూమ్స్ మారకూడదని కొత్త చెకిన్ పాలసీని ప్రారంభించింది.