Indian Railways to operate 13000 Trains | లక్నో: ఈ ఏడాది జరగనున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) కోసం భారత రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు భక్తుల రద్దీ దృష్టింలో ఉంచుకుని 3000 ప్రత్యేక రైళ్లు నడుపుతామని ప్రకటించింది. రెగ్యూలర్ రైలు సర్వీసులు మరో 10 వేలు రైళ్లు అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు రైలు సేవల్ని వినియోగించాలని రైల్వే శాఖ చెబుతోంది. రైల్వే శాఖ మొత్తం 50 రోజులపాటు 13 వేల రైలు సర్వీసులు నడపనుంది. కుంభమేళా ప్రారంభానికి రెండు, మూడు రోజుల ముందు నుంచి ఉత్సవం పూర్తయిన రెండు, మూడు రోజుల వరకు రైలు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 


తరలిరానున్న 40 కోట్ల మంది భక్తులు


ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్వరలో ప్రారంభం కానున్న మహా కుంభమేళాకు సుమారు 40 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం ప్రయాగ్‌రాజ్‌ వద్ద మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.  నార్త్ సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శశికాంత్ త్రిపాఠి కుంభమేళా ఏర్పాట్లపై ఏఎన్ఐతో మాట్లాడుతూ, ‘కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది ప్రజలు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే అవకాశం ఉందని సివిల్ అడ్మినిస్ట్రేషన్  అంచనా వేసింది. అయితే అంత భారీ రద్దీని నియంత్రించడం, వారికి సౌకర్యాలు కల్పించడం సవాల్ లాంటిది. యాత్రికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నేరుగా ప్లాట్‌ఫారాలకు బదులుగా యాత్రి కేంద్రాలకు తరలిస్తాం. క్రిస్ -క్రాస్ కదలికలను నివారించడానికి భక్తులకు డైరెక్షన్ ఇస్తాం. 






మహా కుంభమేళా 2025కు విచ్చేసే యాత్రికుల కోసం 10,000 రెగ్యూలర్ రైళ్లతో పాటు 3000 ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతున్నాం. కుంభమేళాకు ముందు నుంచి ఉత్సవం ముగిసిన తరువాత మూడు రోజుల వరకు సైతం రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సుదూర ప్రాంతాల నుంచి దాదాపు 700 ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. 200- 300 కిలోమీటర్ల దూరాలకు 1800 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌తో సహా చిత్రకూట్, బెనారస్, అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తుల కోసం రైలు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం’ అని త్రిపాఠి తెలిపారు.


Also read: Kumbh Mela 2025: కుంభమేళాకు పుష్కరానికీ తేడా ఏమిటి? ఇవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 


శనివారం భేటీలో కీలక అంశాలపై చర్చ
మహా కుంభమేళా 2025ని సురక్షితంగా, ఘనంగా నిర్వహించేందుకుగానూ శనివారం  ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రయాగ్‌రాజ్ మేళా అథారిటీ, ఇతర ఏజెన్సీలతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) సమావేశమైంది. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని NDRF తెలిపింది. ప్రయాగ్‌రాజ్ జిల్లా పరిపాలన, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, తాగునీటి, ఫైర్ డిపార్ట్‌మెంట్, వైద్యశాఖలు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని శనివారం సమావేమై పలు అంశాలపై చర్చించారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మొహ్సిన్ షాహిదీ ఆధ్వర్యంలో NDRF ప్రత్యేక బృందాలు ఈ మెగా మాక్ ఈవెంట్లో పాల్గొన్నాయి.