EPFO ATM Card : ఈపీఎఫ్ఓ చందాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మే-జూన్ నాటికి కొత్త ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మొబైల్ అప్లికేషన్, డెబిట్ కార్డ్ సౌకర్యాన్ని అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఈ నిర్ణయంతో దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా.. ఏ బ్యాంక్ నుంచి అయినా పింఛన్ తీసుకునేందుకు వీలు ఉంటుంది. దీనిపై ఈపీఎస్ పెన్షన్‌దారులు, పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలనుకునే వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈపీఎఫ్ఓ 3.0
కేంద్రీకృత పింఛన్ చెల్లింపుల వ్యవస్థ (CPPS) విస్తరణను కేంద్రం ఎట్టకేలకు ప్రకటించింది. ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ఓ 2.0 ఐటీ వ్యవస్థను ఈపీఎఫ్ఓ 3.0కి అప్ గ్రేడ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు ఈపీఎఫ్ఓ 3.0 అనే వ్యవస్థ కింద ఏటీఎం కార్డులు అందిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లోగా ఈపీఎఫ్ఓ కటింగ్ ఎడ్జ్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థను తీసుకురానుందన్నారు. ఈ యాప్ ద్వారా చందాదారులు బ్యాంకింగ్ సౌకర్యాలను పొందవచ్చని, ముఖ్యంగా విత్‌డ్రా చేసుకోవడం మరింత సులువు అవుతుందని చెప్పారు. ఈ విషయంపై ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు సాగుతున్నాయని.. ఇవి సఫలమైతే చందాదారులు ఇక డెబిట్ కార్డుల ద్వారానే ఏటీఎం నుంచి ఈపీఎఫ్ఓ నిధులను విత్‌డ్రా చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది.
అయితే ఈ ఏటీఎం కార్డు కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, అసలు దరఖాస్తు చేసుకోవాలా లేదంటే ప్రభుత్వమే స్వయంగా పీఎఫ్ ఖాతా ఉన్నవారి చిరునామాకు ఏటీఎం కార్డును పంపుతుందా అనేది ఇంకా చెప్పలేదు. కానీ, 2025 సంవత్సరంలో మాత్రమే ఇది అందుబాటులోకి రానుంది. దీని ద్వారా మీరు మీ నిర్దిష్ట పీఎఫ్ అమౌంట్ ను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేయొచ్చు.
ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవాలి.. కార్డు ఎలా పనిచేస్తుందంటే..
2025లో ఈపీఎఫ్‌వో కస్టమర్లు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎం కార్డు ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చని ఇటీవలే లేబర్ సెక్రటరీ సుమిత్ దావ్రా చెప్పారు. ఇది కాకుండా, ఖాతాదారులు తమ ఖాతా నుండి 50 శాతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చని కూడా దావ్రా తెలిపారు. అయితే ఇప్పుడు పీఎఫ్ ఖాతాకు వచ్చే ఏటీఎం కార్డు ఎలా పనిచేస్తుందనే ప్రశ్న అందరిలోనూ కలుగుతోంది. ఈ కార్డ్ కూడా సాధారణ ఏటీఎం కార్డ్ లాగానే ఉంటుంది. అదే విధంగా పని చేస్తుంది. బ్యాంకులు ఇచ్చే ఏటీఎం కార్డు నుండి ఎలా అయితే డబ్బును విత్‌డ్రా చేస్తామా.. అదే తరహాలో డబ్బును తీసుకోవచ్చు.
ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్
ప్రస్తుతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులు తమ ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం 7 నుండి 10 రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ క్లెయిమ్‌ను పరిష్కరించిన తర్వాత, డబ్బు నేరుగా ఖాతాదారుల బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే, ఒకవేళ ఏటీఎం సదుపాయాన్ని ప్రవేశపెడితే మాత్రం మీరు మీ పీఎఫ్ ఖాతా నుండి వెంటనే డబ్బును సులభంగా తీసుకోవచ్చు.