Swiggy Instamart : ఆన్ లైన్ షాపింగ్ పేరుతో ఇప్పటికే అనేక యాప్స్, వెబ్ సైట్స్ రాజ్యమేలుతున్నాయి. ఒకప్పుడు ఇంట్లో సామాన్లు, బట్టలు మాత్రమే ఆర్డర్ చేసేందుకు యాక్సెస్ ఉండేది. ఆ తర్వాత ఫుడ్ కూడా ఆన్ లైన్ లోనే తెప్పించుకునే సౌకర్యం వచ్చింది. ఇప్పుడు కిరాణా సామాన్లను కూడా నిమిషాల్లో డెలివరీ చేస్తామంటూ పలు కంపెనీలు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నాయి. సరికొత్త ఆఫర్స్ తో కస్టమర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీని వల్ల రిటైల్ షాపులకు గిరాకీ బాగా తగ్గిపోయింది. ఇంటికే అన్నీ డెలివరీ చేసి ఇస్తుండడంతో చాలా మంది వారు పెట్టే ఆఫర్లు, డిస్కౌంట్లకు త్వరపడుతున్నారు. దీంతో షాపులకు వెళ్లి కొనే పరిస్థితి చాలా వరకు తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF).. ఇటీవల స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ (Swiggy Instamart) చేసిన ప్రకటనపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది.
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ప్రకటన ఇదే
"రిటైల్ షాపుల నుంచి కిరాణా కొనుగోళ్లు చేయడం ఆపండి. మేము 10 నిమిషాల్లో బట్వాడా (డెలివరీ ) చేస్తాము" అని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఓ ప్రకటనలో వినియోగదారులను కోరింది. ఇది భారతదేశం అంతటా మిలియన్ల కొద్దీ చిన్న చిల్లర వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్ల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుందని ఏఐసీపీడీఎఫ్ ఆరోపించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. సాంప్రదాయ రిటైల్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ కు అంతరాయం కలిగించేందుకు చేసిన ప్రయత్నంగా అభివర్ణించిన ఏఐసీపీడీఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశపు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న 1.3 కోట్ల మంది రిటైలర్లు, 8 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లపై ఈ ప్రచారం బహిరంగ దాడిని సూచిస్తుందని సంస్థ ఆరోపించింది.
ఇలాంటి దోపిడీ ప్రచారాలను ఇలాగే వదిలేస్తే మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా భావించే లక్షలాది మంది చిల్లర వ్యాపారులు నిరాశలో కూరుకుపోతారని ఏఐసీపీడీఎఫ్ పోస్ట్ లో తెలిపింది. ఇది రిటైలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కీలకపాత్ర పోషించే రిటైల్ రంగంపై నిర్దాయమైన దాడులను సూచిస్తుందని చెప్పింది. వీటిని అరికట్టడానికి తక్షణమే ఓ నిర్ణయం తీసుకోవాలని ఫెడరేషన్, కేంద్రాన్ని కోరింది. ఈ తరహా పద్దతులు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని బలహీనపరుస్తాయిని, నిరుద్యోగాన్ని మరింత తీవ్రం చేస్తాయని ఆరోపించింది. అయితే ఏఐసీపీడీఎఫ్ చేసిన ఈ ఆరోపణలపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఏ విధంగానూ స్పందించలేదు.
2కోట్ల చిప్స్ ప్యాకెట్లు ఆర్డర్
హైదరాబాద్ లో ఫాస్ట్ డెలివరీలు చేస్తూ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కస్టమర్లను ఆకర్షిస్తోంది. భాగ్యనగరంలో 1.8కి.మీ. దూరాన్ని కేవలం 96 సెకన్లలోనే చేరుకుంటోంది. కూరగాయలతోపాటు చిప్స్. కండోమ్స్, ఐస్ క్రీమ్, మ్యాగీ, పాలు ఎక్కువగా ఆర్డర్స్ చేస్తున్నారని కంపెనీ ఇటీవల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. 2024లో దాదాపు 2కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్టు తెలిపింది.
Also Read : Aadhaar - SIM: మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయో తెలుసుకోండి - అనవసరంగా జైలుకు వెళ్లకండి!