Active SIM cards On Aadhaar Number: ఈ కాలంలో చేతిలో ఫోన్ లేకుండా ఎవరూ కనిపించడం లేదు. ఫోన్‌లో కీలకమైన పార్ట్‌ "సిమ్ కార్డ్". ఈ కార్డ్‌ ద్వారానే కమ్యూనికేషన్‌ జరుగుతుంది. సిమ్‌ తీసుకోవాలంటే ఇప్పుడు రూల్స్‌ టైట్‌గా మారాయి, పరిస్థితులు గతంలో ఉన్నంత ఈజీ మాత్రం లేవు. 


సిమ్‌ కార్డ్‌ రూల్స్‌
సిమ్‌ కార్డ్‌ కావాలంటే తప్పనిసరిగా వ్యక్తిగత గుర్తింపు కార్డు ఇచ్చి, నిర్ణీత ధర చెల్లించాలి. చాలా మంది, సిమ్ కార్డు కొనేందుకు వ్యక్తిగత గుర్తింపుగా ఆధార్ కార్డును వినియోగిస్తున్నారు. కొందరు తప్పుడు వ్యక్తులు.. ఇతరుల ఆధార్ నంబర్లను సేకరించి, వాటి ద్వారా సిమ్ కార్డులను కొనుగోలు చేస్తున్నారు. అంటే, ఒక వ్యక్తికి తెలీకుండానే అతని ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి సిమ్‌ తీసుకుంటున్నారు & అసాంఘిక కార్యకలాపాల కోసం దానిని వినియోగిస్తున్నారు. ఒకవేళ ఆ సిమ్‌ను ఉపయోగించి ఏదైనా నేరం జరిగితే, ఆ సిమ్‌కు అనుసంధానమైన ఆధార్‌ నంబర్‌ కలిగిన వ్యక్తి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. పోలీసులు ఆ ఆధార్‌కార్డ్‌ హోల్డర్‌ ఇంటిని వెతుక్కుంటూ వస్తారు. అంటే, తనకు తెలీని & తాను చేయని నేరానికి బలి కావాల్సి వస్తుంది. ఆ సిమ్‌ తాను తీసుకోలేదని & వినియోగించలేదని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడాల్సి ఉంటుంది. అందువల్ల, ప్రతి వ్యక్తి, తన ఆధార్‌ నంబర్‌పై ఎన్ని యాక్టివ్‌ సిమ్‌లు ఉన్నాయో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. 


ఆధార్‌ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? 
మీ ఆధార్‌ నంబర్‌పై ఎన్ని సిమ్‌ కార్డ్‌లు యాక్టివ్‌గా పని చేస్తున్నాయో తెలుసుకోవడం చాలా సులభం. మీరు భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ sancharsaathi.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలోని 'Citizen Centric Services' మీద క్లిక్‌ చేసి, ఆ తర్వాత 'Know Your Mobile Connections' మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మీ మొబైల్‌ నంబర్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP) వస్తుంది. దానిని సంబంధిత గడిలో నమోదు చేసిన సబ్మిట్‌ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌తో తీసుకున్న అన్ని సిమ్ కార్డ్‌ల వివరాలను స్క్రీన్‌ మీద మీకు కనిపిస్తాయి. దానిలో ఏదైనా నంబర్‌ మీకు అనుమానాస్పదంగా కనిపించినా లేదా మీరు ఆ నంబర్‌ తీసుకోలేదని గుర్తించినా దానిని వెంటనే రద్దు చేయవచ్చు. దీని కోసం, ఆ నంబర్‌ పక్కన ఉన్న 'Not required' మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్‌కు - ఆ నంబర్‌కు లింక్‌ తెగిపోతుంది, మీరు నిర్భయంగా ఉండవచ్చు.



ఒక ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు ఉండవచ్చు?
ఆధార్‌ కార్డ్‌ ఉంది కదాని ఇష్టం వచ్చినన్ని సిమ్‌లు తీసుకోవడానికి వీల్లేదు. ఆధార్‌ ప్రాతిపదికన ఉండాల్సిన సిమ్‌ల సంఖ్యను భారత టెలికాం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఏ కాలంలో చూసినా, ఒక ఆధార్‌ నంబర్‌పై 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు తీసుకోలేరు. ఈ రూల్‌ అతిక్రమిస్తే రూ. 50,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పరిస్థితి తీవ్రతను బట్టి రూ. 2 లక్షల వరకు కూడా జరిమానా కట్టాల్సి రావచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఫ్లైట్‌లో 7 కిలోల లగేజ్‌కు మాత్రమే అనుమతి - హ్యాండ్ బ్యాగ్ బరువును కూడా కలుపుతారా?