Indian Coast Guard Helicopter Crashes | పోరుబందర్: భారతీయ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ విమానాశ్రయంలో కూలిపోయింది. ఎయిర్ పోర్టులో సాధారణ శిక్షణ జరుగుతుండగా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ధృవ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా మొత్తం ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ ధృవ్ సాంకేతిక లోపంతో కుప్పకూలగానే మంటలు చెలరేగి, ఆ ప్రాంతాన్ని పొగొలు కమ్మేశాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే హెలికాఫ్టర్ లో ఉన్న ముగ్గురు మృతిచెందడంతో విషాదం నెలకొంది. 

పోర్‌బందర్ డీఎం ఎస్‌డీ ధనానీ హెలికాప్టర్ ప్రమాదంపై స్పందించారు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ.. పోరుబందర్ విమానాశ్రయంలో శిక్షణ ఇస్తుండుగా ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ధృవ్ కుల్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు ముగిశాయని ధనానీ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, మెడికల్ టీమ్ అక్కడికి స్థలానికి చేరుకున్నాయి. కానీ మంటలు చెలరేగడంతో ప్రాణాలు కాపాడలేకపోయామని చెప్పారు.

కాలిన స్థితిలో ఆస్పత్రికి తరలించిన రెస్క్యూ టీమ్

పోర్ బందర్ పోలీస్ సూపరింటెండెంట్ భగీరత్‌ సింగ్ జడేజా ఈ ప్రమాదంపై మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటత తరువాత కోస్ట్ గార్డ్ కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది. క్రాష్ అయిన వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని తీవ్రంగా కాలిపోయిన స్థితిలో ఉన్న ముగ్గురు సిబ్బందిని బయటకు తీసుకువచ్చి, పోర్‌బందర్‌లోని ఆసుపత్రికి తరలించారని పిటిఐకి ఆయన తెలిపారు. కానీ హాస్పిటల్ కు తరలించిన కొంత సమయానికే ముగ్గురూ ఆసుపత్రిలో మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారని కమలా బాగ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ రాజేష్ కన్మియా తెలిపారు. అనూహ్య ప్రమాదంపై ఇండియన్ కోస్ట్ గార్డ్ దర్యాప్తు చేస్తోంది.

2002 నుంచి సేవలు అందిస్తున్న ధృవ్

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) రూపొందించిన ALH ధ్రువ్ ట్విన్-ఇంజన్ హెలికాప్టర్. దీనిని వరదలు, మిలిటరీ లాంటి అత్యవసర అవసరాల కోసం తయారుచేశారు. హెలికాప్టర్ ధృవ్ 2002 నుంచి సేవలు అందిస్తోంది. అయితే సెప్టెంబర్ 2, 2024 న కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన అడ్వాన్స్‌డ్ హెలికాప్టర్ పోర్‌బందర్ తీరానికి సమీపంలో అరేబియా సముద్రంలో పడిపోవడం తెలిసిందే. నలుగురిలో ఒకరు ప్రాణాలతో ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

కేరళలోని కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో మార్చి 26, 2023న ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ మార్క్ 3 టెస్టింగ్ సమయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రమాదంలో ఓ ట్రైనీ పైలట్ చేయి విరిగినట్లు అధికారులు తెలిపారు.

Also Read: Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు, 40 కోట్ల మంది వస్తారని అంచనా- సీపీఆర్వో