Telangana CM Revanth Reddy | హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టిందని, దేశంలోనే ఇది రికార్డు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా భవన్‌లో ఆదివారం నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సివిల్స్ సర్వీసెస్ మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది తెలంగాణ అభ్యర్థులకు ఒక్కొకరికి రూ.1 లక్ష రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి అందించారు.
ఉద్యోగాల కోసం రాష్ట్రం సాధించుకున్నాం..
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం. కానీ బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. అటు వయసు మీద పడి వేరే పనులు చేసుకుంటున్నావారు ఉన్నారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వెనుకబడిన రాష్ట్రం బిహార్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అవుతున్నారు. అక్కడి ప్రభుత్వం వారికి మద్దుతుగా నిలిచి సహకారం అందించడమే అందుకు కారణం. తెలంగాణ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు సివిల్స్ కు ఎంపిక కావాలనేది మా ఉద్దేశం.
కష్టంతో పాటు కమిట్మెంట్ కూడా ఉండాలి..
మన రాష్ట్రంలో కూడా నిరుద్యోగులకు సహకారం ఉండాలని, సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సహకారం అందించాలని రాజీవ్ సివిల్స్ అభయహస్తం ద్వారా లక్ష రూపాయల చొప్పున సాయం అందిస్తున్నాం. ఇది వారికి అందిస్తున్న ప్రోత్సాహంగా భావించాలి. కష్టంతో పాటు మీకు కమిట్మెంట్ ఉంటేనే విజయం మిమ్మల్ని వరిస్తుంది. సివిల్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఫైనల్ ఇంటర్వ్యూకు వెళ్లే మన అభ్యర్థులు అందరూ సివిల్స్ లో సెలెక్ట్ అవ్వాలని’ ఆకాంక్షించారు.
మార్చిలోగా గ్రూప్ 1 పోస్టుల భర్తీ
ఉమ్మడి ఏపీ, తెలంగాణలో ఓవరాల్‌గా చూసుకుంటే గత 14 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదు. కానీ ఎన్నో అడ్డంకులను మేం అధిగమించి 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్, మెయిన్స్ సైతం నిర్వహించాం. మార్చి 31లోగా గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం యువత గురించి, నిరుద్యోగుల గురించే ఆలోచిస్తోంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రం నుంచి సివిల్స్ కు ఎక్కువ మంది సెలక్ట్ అవ్వాలనే లక్ష్యంతో అభ్యర్థులకు ప్రోత్సహకంగా రూ.1 లక్ష ఇస్తున్నాం. - తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏమన్నారంటే..
యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో తెలంగాణ యువత విజయాలు సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ క్వాలిఫై అయి ఇంటర్వ్యూలకు వెళ్లే వారిని చూస్తే గర్వంగా ఉందన్నారు. దేశంలో ఉన్నత సర్వీసులైన UPSC పరీక్షలు రాసే వారిని ప్రోత్సహించాలనే రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. వారి తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా అభ్యర్థులు సెలక్ట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.