Klin Kaara Watches Ram Charan RRR: మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫేస్‌ని ఇంత వరకు మెగా ఫ్యామిలీ రివీల్ చేయలేదు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. కట్టు దిట్టమైన భద్రత మధ్య షూటింగ్ జరుగుతున్నా.. ఏదో రకంగా లీక్ అవుతున్న రోజులివి. అలాగే సోషల్ మీడియా మనుషుల జీవితాలలోకి బాగా చొచ్చుకుపోతున్న కాలమిది. అలాంటిది, మెగా ప్రిన్సెస్ క్లీంకార పుట్టి సంవత్సరం పూర్తైనా, ఆమె నడక నేర్చుకుని నడుస్తూ ఉన్నా.. ఇప్పటి వరకు ఫేస్ కనిపించలేదంటే.. ఆ పాపని మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా ఉపాసన కొణిదెల ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. అయితే సినిమాకు ముందు గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అనేలా.. ఫేస్ రివీల్ చేయడం లేదు కానీ.. ఆ పాప ఎలా ఉంది? ఏం చేస్తుందనే విషయాలను మాత్రం ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూనే ఉంది. తాజాగా అలా ఆమె షేర్ చేసిన వీడియో ఒకటి, క్లీంకార పేరును ట్రెండ్ అయ్యేలా చేసింది. అసలింతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఉపాసన షేర్ చేసిన వీడియోలో క్లీంకార పాప ఫేస్ కనిపించలేదు కానీ.. మెగా ఫ్యాన్స్‌ని ఆనందపరిచే విషయం అయితే ఈ వీడియోలో ఉంది. అంతేకాదు, క్లీంకార పాపని కాస్త ఎక్కువ టైమ్ చూసే అవకాశం కూడా ఈ వీడియో ద్వారా ఉపాసన కల్పించింది. ఇక వీడియోలో.. చిట్టితల్లి క్లీంకార ఆర్ఆర్ఆర్ బిహైండ్ సీన్స్‌తో వచ్చిన డాక్యుమెంటరీ చూస్తోంది. ఇంట్లో ఉన్న టీవీలో ఇటీవల విడుదలైన డాక్యుమెంటరీ ప్లే అవుతుండగా.. సడెన్‌గా తన తండ్రి టీవీ స్క్రీన్‌పై మాట్లాడుతుండటంతో క్లీంకార సంబరపడిపోయింది. ఆర్ఆర్ఆర్ బిహైండ్ వీడియోలో రామ్ చరణ్ సినిమా గురించి చెబుతుండగా.. సినిమాలోని సన్నివేశాలు కూడా ప్లే అవుతున్నాయి. అందులో తండ్రి రామ్ చరణ్ కనిపించగానే పాప ఎంతగానో ఎగ్జయిట్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే, టీవీ స్క్రీన్‌పై ఉంది తన తండ్రే అని క్లీంకార గుర్తు పట్టేసింది.
టీవీలో తన తండ్రిని చూస్తూ మురిసిపోతున్న క్లీంకార వీడియోని షేర్ చేసిన ఉపాసన.. ‘‘ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇస్తోంది. తన నాన్న రామ్ చరణ్‌ని తొలిసారి టీవీలో చూసి క్లీంకార ఎంతో ఆనందం వ్యక్తం చేసినట్లుగా చెప్పుకొచ్చింది. రామ్ చరణ్ నీ విషయంలో ఎంతో గర్వంగా ఉంది. నీ గేమ్ చేంజర్ సినిమా కోసం ఎంతగానో వేచి చూస్తున్నాం’’ అని తన పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. అంతేకాదు, ఈ వీడియోపై తాత చిరంజీవి, తండ్రి రామ్ చరణ్‌ల రియాక్షన్ ఏంటో చూడాలని ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి స్పెషల్‌గా ఈ సినిమా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. తెలుగమ్మాయ్ అంజలి మరో ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఎస్. జె. సూర్య ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ యమా జోరుగా సాగుతున్నాయి. రాజమండ్రిలో శనివారం ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.