Game Changer Trailer Launch Highlights: ''నేను రామ్ చరణ్ హీరోగా 'మగధీర' సినిమా చేశా. అప్పటికీ, ఇప్పటికీ అతని నటనలో ఎంతో పరిణితి కనిపించింది. హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకుని లుంగీలో దిగే సన్నివేశానికి థియేటర్లలో విజిల్స్ పెడతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిక్ షాట్స్ ఎంత బాగా చేస్తాడో... హృద్యమైన సన్నివేశాలు సైతం అంతే బాగా చేస్తాడు'' అని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) అన్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan )కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ నిర్మించిన 'గేమ్ చేంజర్' (Game Changer) ట్రైలర్ విడుదల కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ హైలైట్స్ ఏంటి? ఇందులో ఎవరు ఏం మాట్లాడారు? అందులో ముఖ్యమైన అంశాలు ఏంటి? అనేది చూస్తే...
చరణ్... ఆ సన్నివేశాలకు నా అనుమతి తీసుకో! - రాజమౌళి
'గేమ్ చేంజర్' ట్రైలర్ చూస్తే... అందులో రామ్ చరణ్ గుర్రం మీద వచ్చే విజువల్ ఒకటి ఉంది. దాని గురించి రాజమౌళి... ''చరణ్, నెక్స్ట్ నుంచి నువ్వు హార్స్ రైడింగ్ సీన్స్ చేసేటప్పుడు నా పర్మిషన్ తీసుకో. అవి నా విజువల్స్. నాకు రైట్స్ రాసి ఇచ్చేయ్. పేపర్స్ రెడీ చేస్తా. సంతకాలు చేసి పంపించు'' సరదాగా వ్యాఖ్యానించారు.
దర్శకుడు శంకర్ మీద రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. కథ, సన్నివేశాల విషయంలో ఎంతైనా ఊహించుకుని తీయవచ్చనే స్ఫూర్తి ఇచ్చినది శంకర్ అని ఆయన గుర్తు చేశారు చేశారు. దర్శకులలో శంకర్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అని చెప్పుకొచ్చారు.
మహేష్ బాబు సినిమా ఏడాదిన్నరలో వచ్చేస్తుంది! - రామ్ చరణ్
మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఈ రోజు (జనవరి 2న) పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు నిర్మాత 'దిల్' రాజు, సంగీత దర్శకుడు తమన్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక యాంకర్ సుమ అయితే ఆ సినిమా ఎప్పుడు విడుదల కావచ్చు? అని ప్రశ్నించగా... ''నాకు తెలిసి కోవిడ్ వంటివి లేకపోతే ఏడాదిన్నరలో వచ్చేస్తుంది'' అని రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు. వెంటనే రాజమౌళి వచ్చి ''బాగా ట్రైనింగ్ ఇచ్చాను'' అనడంతో అందరూ నవ్వేశారు.
సంక్రాంతి కాదు... రాబోయేది రామ నవమి - శంకర్
'గేమ్ చేంజర్' గురించి మాటలు రచయిత బుర్ర సాయి మాధవ్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ... ''సంక్రాంతి కాదు... థియేటర్లలో శంక్రాంతి'' అని చెప్పారు. ఇంతకుముందు కూడా ఆయన ఈ విధంగా మాట్లాడారు. అయితే, దర్శకుడు శంకర్ మాట్లాడుతూ... ''అందరూ చెప్పారు ఇది శంక్రాంతి అని. కాదండి... ఇది రామనవమి. రామ్ చరణ్ గారిని చూడడం కోసం థియేటర్లకు ప్రేక్షకులు వస్తారు. రామ్ చరణ్ అంత బాగా చేశారు'' అని చెప్పారు. తనకు 'ఒక్కడు', 'పోకిరి' లాంటి సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో ఉండేదని, అటువంటి సినిమా 'గేమ్ చేంజర్' అని శంకర్ చెప్పుకొచ్చారు.
Also Read: ‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే... రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?
తొడ కొట్టాలని ఉంది... కానీ ఓవర్ అవుతుందని! - 'దిల్' రాజు
సంగీత దర్శకుడు తమన్ కోసం ప్రసాద్ లాబ్స్ దగ్గరకు వెళ్ళినప్పుడు కొన్ని రీల్స్ సినిమా చూపించాడని, అవి చూసిన తర్వాత తనకు తొడ కొట్టాలని అనిపించిందని, కానీ ఓవర్ అవుతుందని ఆగాను అని నిర్మాత 'దిల్' రాజు చెప్పారు. 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో కలిసి నటించినప్పటికీ... అప్పటికి, ఇప్పటికీ రామ్ చరణ్ నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదగాడని శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.జే. సూర్య, అంజలి, సముద్రఖని తదితరులు పాల్గొన్నారు.
Also Read
: ‘గేమ్ చేంజర్’పై ఎఫెక్ట్ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే