AP Minister Kandula Durgesh | రాజమహేంద్రవరం: ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న అద్భుత దృశ్య కావ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీలో సినిమా పరిశ్రమను ప్రోత్సహిస్తామని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఫిల్మ్ పాలసీని తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు. రాజమహేంద్రవరంలోని వేమగిరిలో శనివారం జరిగిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. 


చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు కళలపై అభిమానం


తెలుగు సినీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది అనే విషయంపై మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు తెలుగు భాషతో పాటు, కళలపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీలో కొత్త ఫిల్మ్ పాలసీ తేవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో  సినిమా చరిత్రలో ఈ మూవీ నిజంగానే గేమ్ ఛేంజర్ గా నిలబడాలని కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. సినిమా సినిమాకి పరిణతి కనబరుస్తూ, అద్భుతమైన నటుడిగా రామ్ చరణ్ ఎదుగుతూ, తండ్రికి తగ్గ తనయుడుగా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారంటూ ప్రశంసించారు. రామ్ చరణ్ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారని గ్లోబల్ స్టార్‌ను మెచ్చుకున్నారు. గోదావరి తీరాన  రాజమహేంద్రవరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే వేదిక పంచుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు.


ఏపీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న మంత్రి


ఈ సందర్భంగా సినీ దర్శకులు, నిర్మాతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఏపీలో చాలా సినిమాలు తీస్తున్నారు. సినిమా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్‌లో కావాలసిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త టూరిజం పాలసీ తెచ్చినట్టు, సినీ పరిశ్రమ అభివృద్ధికిగానూ ప్రత్యేక పాలసీని తీసుకొచ్చి ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.


ఏపీని ప్రత్యేకంగా చూడాలని సినీ దర్శక నిర్మాతలకు సూచన


దేశంలోనే అత్యంత గొప్ప డైరెక్టర్లలో ఒకరైన శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ రూపొందడం సంతోషంగా ఉంది. ఈ మూవీ కోసం అహర్నిశలు కష్టపడిన చిత్ర యూనిట్‌ను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. టాలీవుడ్ నిర్మాతలు సినిమాల విషయంలో ఏపీని ప్రత్యేకంగా చూడాలని, తమ వంతు సహకారం అందించడానికి ప్రభుత్వం సిద్ధమేనని మరోసారి స్పష్టం చేశారు. 


Also Read: Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు 


తమ ప్రభుత్వం సినీ ప్రముఖులతో చేతులు జోడించి నమస్కారాలు పెట్టించుకుంటూ వారిని తక్కువగా చూడదని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లను రాజకీయాలతో ముడిపెట్టి వేధించడం కూటమి ప్రభుత్వ నైజం కాదన్నారు. టికెట్ల రేట్ల పెంపుపై మాట్లాడేందుకు హీరోలు కాదు ప్రత్యేక బాడీ ఏర్పాటు చేస్తే వారు ప్రభుత్వంతో చర్చలు జరుపుతారని పవన్ పేర్కొన్నారు. ఎంత ఎదిగినా మూలాలు మరిచిపోవద్దు అని తన ప్రసంగంలో పదే పదే సూచించారు.