'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Game Changer Pre Release Event)కు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తనకు తమ్ముడితో సమానమని గొప్పగా చెప్పారు. ఏపీని చిన్నచూపు చూడవద్దని దిల్ రాజుకు విజ్ఞప్తి చేయడంతో పాటు 'గేమ్ చేంజర్'తో బాక్సాఫీస్ బద్దలు కావాలని ఆశించారు. అయితే... ఈ వేడుకలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఎవరిని ఉద్దేశించి అనే చర్చ జరుగుతోంది.
కూటమికి హీరోలంతా మద్దతు ఇవ్వలేదు...
అయినా మేము ఎవరికీ వ్యతిరేకం కాదు!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరికి తమ కూటమి ప్రభుత్వం వ్యతిరేకం కాదు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. సినిమా టికెట్ రేట్లు పెంచడం గురించి మాట్లాడిన సమయంలో ''కూటమి ప్రభుత్వానికి హీరోలు అందరూ మద్దతు తెలపలేదు. అయినా మేము ఎవరికీ వ్యతిరేకం కాదు, ఎవరి మీద వివక్ష చూపించలేదు. ఇండస్ట్రీకి రాజకీయ రంగు పులమడం మా కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. సినిమాలలో రాజకీయ జోక్యం ఉండకూడదని మేం కోరుకుంటాం'' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
ఏపీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్లు పెంచుతూ జీవోలు జారీ చేశారు. అందులో మొదటి సినిమా ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 ఏడీ'. రెండో సినిమా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర'. మూడోది అల్లు అర్జున్ 'పుష్ప 2'. ఏపీలో ఎన్నికలకు ముందు ప్రభాస్ గానీ, ఎన్టీఆర్ గానీ ఎవరి పక్షం తీసుకోలేదు. ఒకరికి మద్దతుగా గానీ, మరొకరికి వ్యతిరేకంగా గానీ వ్యవహరించలేదు. అల్లు అర్జున్ మాత్రం కూటమి ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేసిన నంద్యాల వైసిపి క్యాండిడేట్ శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లారు. అది వివాదాస్పదం అయింది. బన్నీని ఉద్దేశించి పవన్ ఆ వ్యాఖ్యలు చేశారనేది కొంత మంది అభిప్రాయం. 'మూలాలు మర్చిపోకూడదు' అని పవన్ పదేపదే తన స్పీచ్‌లో పేర్కొన్నారు. అదీ బన్నీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని ఇండస్ట్రీ గుసగస.
హీరోలతో దండాలు పెట్టించుకునే వ్యక్తులను కాదు
వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వం మీద, మాజీ ముఖ్యమంత్రి మీద పవన్ కళ్యాణ్ పరోక్షంగా చురకలు వేశారు. గత ప్రభుత్వం తన 'భీమ్లా నాయక్' సినిమాకు టికెట్ ధరలు పెంచకపోగా తగ్గించిందని ఆయన గుర్తు చేశారు. ఒక విధంగా అది జగన్ రెడ్డి మీద వేసిన సెటైర్. అంతే కాదు... హీరోలతో దండాలు పెట్టించుకునే వ్యక్తులం తాము కాదు అని పవన్ అన్నారు. అదీ జగన్మోహన్ రెడ్డి మీద వేసిన సెటైర్.
తెలుగు చిత్ర సీమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వాళ్లే మాట్లాడాలని, సినిమాలు తీసే వాళ్లతోనే తాము మాట్లాడతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. సినిమా టికెట్ రేట్లు పెంచమని కోరడానికి నిర్మాతలు లేదా ట్రేడ్ యూనియన్ బాడీలు రావాలని ఆయన తెలిపారు. ''టికెట్ రేట్లు పెంచే విషయంలో హీరోలతో పని ఏంటి? హీరోల వచ్చి దండాలు పెట్టాలని ఇంత కిందిస్థాయి వ్యక్తులం కాదు'' అని పవన్ వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టికెట్ రేట్స్ పెంచమని కోరుతూ ఇండస్ట్రీ నుంచి కొంతమంది తాడేపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లడం, ఆ సమావేశంలో చిరంజీవి రెండు చేతులు జోడించి నమస్కరించడం పట్ల పవన్ ఎన్నికలకు ముందు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ రెడ్డికి చురుకులు అంటించారు.