Lyrical Writer Anantha Sriram Sensational Comments: సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని.. అలాంటి సినిమాలను హిందువులు బహిష్కరించాలని సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ (Anantha Sriram) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ (VHP) ఆధ్వర్యంలో నిర్వహించిన 'హైందవ శంఖారావం' (Hyndava Shankaravam) సభలో ఆయన ప్రసంగించారు. 'సినిమాల్లో హైందవ పురాణాలను వక్రీకరిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోంది. కొందరు అన్యమతస్తుల ప్రవర్తన ఇబ్బంది పెడుతోంది. అలాగే కల్కి సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారు. ఆయన్ను శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారు?. సినిమాల్లో పురాణాలపై ఇలాంటి వక్రీకరణలు చూసి నేనే సిగ్గుపడుతున్నా. అలాగే ఎవరు చేసినా తప్పును తప్పు అని చెప్పాల్సిందే.' అని అన్నారు. కాగా, ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలతో పాటు హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు హాజరయ్యారు. దీంతో సభా ప్రాంగణం సంద్రాన్ని తలపించింది.
'హిందూ సమాజానికి క్షమాపణలు'
వాల్మీకి రామాయణం, వ్యాస భారతం.. భారత సాహిత్య వాంగ్మయానికి రెండు కళ్లు లాంటివని.. అలాంటి వాటినే వినోదం కోసం వక్రీకరించారని అనంత్ శ్రీరామ్ అన్నారు. 'హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరిస్తే.. అలాంటి వాటికి డబ్బులు రావు. ఈ క్రమంలో నిర్మాతలు అలాంటి సినిమాలు తీయరు. వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం సినిమా. ఈ రెండింటినీ జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతోంది. సినీ పరిశ్రమలో జరిగే తప్పులను ఆ రంగానికి చెందిన వ్యక్తిగా బాహాటంగానే విమర్శిస్తున్నా. ఇప్పటివరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ హననానికి.. హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నా. పురాణేతిహాసాల గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి పాత్రలు మార్చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వ్యాసుడు, వాల్మీకి రచనలను వినోదం కోసం వక్రీకరిస్తున్నారు.' అని పేర్కొన్నారు.
పాత్రల ఔన్నత్యాన్ని మారిస్తే హైందవ ధర్మాన్ని అంగీకరించినట్లు కాదని.. నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు ఎలా గొప్పవాడు అవుతారని.? అనంత శ్రీరామ్ అన్నారు. 'భారత, రామాయణ భాగవతాల్లో పురాణాలను ఇష్టం వచ్చినట్లు మార్చేశారు. ఇష్టం వచ్చినట్లు వక్రీకరిస్తున్నా మనం చూస్తున్నాం. చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్నో రకాల అవమానాలు జరిగాయి. ఓ దర్శకుడు.. పాటలో 'బ్రహ్మాండ నాయకుడు' అనే పదం ఉండకూడదని చెబితే 15 ఏళ్లుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలి. లేదంటే హిందువులే వాటిని పూర్తిగా బహిష్కరించాలి. అప్పుడే హిందు ధర్మానికి గౌరవం, గుర్తింపు ఉంటాయి.' అని స్పష్టం చేశారు.
కాగా, గత ఐదేళ్లలో హైందవ ధర్మంపై విపరీతంగా దాడి జరిగిందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ తీరు వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. అందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తేనే ఆలయాల స్వయం ప్రతిపత్తి, హిందూ ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.