PM Modi Launches Namo Bharat Corridor In Delhi: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఢిల్లీ - ఘజియాబాద్ - మేరఠ్ నమో భారత్ కారిడార్‌ను (Namo Bharat Corridor) ఆదివారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాహిబాబాద్, ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ ఆర్ఆర్‌టీఎస్ (RRTS) కారిడార్‌లో 13 కి.మీల అదనపు సెక్షన్‌ను ఆయన ప్రారంభించారు. హిండన్ ఎయిర్‌బేస్ నుంచి సాహిబాబాద్ చేరుకున్న ప్రధాని అదనపు మెట్రో లైన్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ప్రయాణించారు. చిన్నారులు వేసిన పెయింటింగ్స్‌ను ఆసక్తిగా తిలకించి వారితో సరదాగా ముచ్చటించారు. ఈ మార్గంలో కొత్తగా ప్రారంభించిన రైలు 13 కి.మీ విభాగంలో 6 కి.మీ మేర భూగర్భంలో నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నమో భారత్ రైళ్లు భూగర్భ విభాగంలో నడపడం ఇదే తొలిసారి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లను అనుసంధానం చేసేలా నమో భారత్ స్టేషన్లను రూపొందించారు.
ప్రస్తుతం, RRTS ఢిల్లీ - మీరఠ్ కారిడార్‌లో 42 కి.మీ మేర నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఢిల్లీ మెట్రోకు NCRలో 393 కి.మీల నెట్‌వర్క్ ఉంది. ఢిల్లీలో రవాణా వ్యవస్థను విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశ రాజధాని అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి పూర్తిగా అంకితమైన ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
కాగా, ఈ కొత్త కనెక్టివిటీ వల్ల లక్షలాది మంది ప్రయాణికులకు నేరుగా ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో ఢిల్లీ మెట్రో ఫేజ్ - 4లోని జనక్‌పురి - కృష్ణా పార్క్ మధ్య 2.8 కి.మీల విస్తీర్ణాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది ఢిల్లీ మెట్రో ఫేజ్ - 4 మొదటి విభాగం ప్రారంభంతో ఇది నెట్‍వర్క్‌ను మరింత విస్తరిస్తుంది. ఢిల్లీ - మీరట్ RRTS కారిడార్ పొడవు 82.15 కి.మీ కాగా.. ఢిల్లీలో 14 కి.మీలు, యూపీలో 68 కి.మీ మేర ఉండనుంది. ఢిల్లీ నుంచి పానిపట్, ఆల్వార్ వరకూ కారిడార్ నిర్మాణం తర్వాత ఢిల్లీ - NCRలోని RRTSలోని అన్ని కారిడార్ల మొత్తం పొడవు 291 కి.మీలకు పైగా ఉంటుంది. ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేసినట్లు చెబుతుండగా.. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.
'ఆప్ ప్రభుత్వంతో విసిగిపోయారు'
ఆప్ ప్రభుత్వంతో ఢిల్లీ ప్రజలు విసిగిపోయారని.. ప్రస్తుతం వారు దేశ రాజధానిని అభివృద్ధి బాటలో నడిపే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. కార్యక్రమానికి ముందు ఆయన మాట్లాడారు. ప్రస్తుత నమో భారత్ కారిడార్ ఢిల్లీ - మేరఠ్ మధ్య ప్రయాణాన్ని సులభం చేస్తుందన్నారు.