Breaking News Live Telugu Updates: క్యాసినో కేసులో ఈడీ సోదాలు, ఏకకాలంలో వీరిఇళ్లపై దాడులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో సోమవారం రాత్రి మిస్సయిన సాయిప్రియ నెల్లూరులో ఉన్నట్టు గుర్తించారు. పెళ్లిరోజు సరదాగా గడిపేందుకు దంపతులు వైజాగ్ బీచ్ కు వచ్చిన సమయంలో, భర్త ఫోన్ చూస్తుండగా సాయిప్రియ ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. సముద్రంలోకి వెళ్ళిపోయి ఉంటుందని భర్త శ్రీనివాస్ భావించారు. అయితే, నెల్లూరుకు చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లుగా తాజాగా బయటికి వచ్చింది. సాయిప్రియ కోసం నేవీ హెలికాప్టర్ లతో అధికారులు వెతికిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏకకాలంలో 8 చోట్ల ఈడీ సోదాలు జరిగాయి. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లపై ఈడీ రైడ్స్ నిర్వహించింది. ఫెమా కింద ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో చికోటి ప్రవీణ్‌పై సీబీఐ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈడీ దాడులకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.
Background
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉపరితల ద్రోణి తూర్పు రాజస్థాన్ పరిసర ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఈ ద్రోణి కొనసాగుతూ సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ- 3.1 కి.మీ మధ్య విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి మీ వరకు వ్యాపించి ఉందని వెల్లడించారు.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కొన్నిచోట్ల మంగళవారం వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మూసీ నదికి వరద పెరిగింది. మలక్ పేట్ వంతెన వద్ద వరద నీరు చేరి, మూసారంబాగ్ వంతెనపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. నేడు సైతం నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరద నీటి ప్రవాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను పోలీసులు, అధికారులు హెచ్చరించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో పిడుగులు పడే పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలో మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర లోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో నేడు తేలికపాటి జల్లులు పడతాయి. మరో మూడు రోజులు ఇదే తీరుగా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ఉపరితల ఆవర్తనం కారణంగా ముఖ్యంగా అనంతపురం, కడప జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షం కురవనుందన్నారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -