Pinnelli Ramakrishna Reddy Follower Turaka Kishore Arrested | మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పలు అరాచకాలకు పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న కిశోర్‌ను హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. కిశోర్‌పై మూడు హత్యాయత్నం కేసులతో పాటు పలు దాడి కేసులున్నాయి. మల్కాజిగిరిలోని జయపురికాలనీలో కిశోర్‌ను విజయపురి సౌత్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని ఏపీకి తరలించారు. టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల పట్టణంలో దాడి చేసిన కేసులో కిశోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అతడు టీడీపీ నేతల వాహనాలపై దాడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు అప్పట్లో వైరల్ కావడం తెలిసిందే.


ఎన్నికల తరువాత అజ్ఞాతంలోకి కిశోర్


2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో దాడులకు పాల్పడిన అనంతరం తురక కిశోర్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మాచర్ల అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలతో గత ఏడాది ఏడాది మే నెలలో పిన్నెల్లి సోదరులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అప్పటినుంచి వారి ప్రధాన అనుచరుడు కిశోర్ జాడ సైతం పోలీసులకు దొరకలేదు. ఏపీలో ఎన్నికల అనంతరం పిన్నెల్లి సోదరులు ఏపీని వీడటంతో వారి అనుచరుడు కిశోర్ బెంగళూరుకు వెళ్లి తన సోదరుడు శ్రీకాంత్ వద్ద ఉన్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు హైదరాబాద్ వస్తున్నాడన్న సమాచారం జయపురి సౌత్ ఎస్సై షఫీ టీమ్ నగరానికి వచ్చింది. ఆదివారం ఉదయం వైసీపీ నేత కిశోర్‌తో పాటు అతడి సోదరుడు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని మాచర్లకు తీసుకొచ్చి ఓ రహస్య ప్రదేశంలో పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసులు నేడు (సోమవారం) కిశోర్, అతడి సోదరుడ్ని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.


స్థానిక సంస్థల ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు నామినేషన్లు వేయనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. దీనిపై పరిశీలకులుగా టీడీపీ తరఫున బొండా ఉమ, బుద్ధా వెంకన్నలను చంద్రబాబు అక్కడికి పంపారు. మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు వద్దకు రాగానే వీరి వాహనంపై దాడికి దిగారు. ఈ క్రమంలో పెద్ద కర్రతో కిశోర్ టీడీపీ నేతల వాహనంపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం కిశోర్‌ను మాచర్ల మున్సిపల్ ఛైర్మన్‌ను చేయగా రెండేళ్లు ఆ పదవిలో కొనసాగారు.


వైసిపి మాజీ మున్సిపల్ చైర్మన్ కిషోర్ అరాచకాలు...
డిసెంబర్ 16 ,2022 న తెలుగుదేశం పార్టీ మాచర్లలో నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టింది. ఆ సమయంలో టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ నేతలు దహనం చేసిన కేసులో ప్రధాన నిందితుడు కిశోర్. టిడిపి ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పై దాడి చేశారని ఆరోపణలున్నాయి. దాడి అనంతరం మాచర్ల పట్టణంలో టిడిపి ఆస్తులను, టీడీపీ నేతల ఇళ్లల్లోకి చొరబడి విధ్వంసం చేసిన ఘటనలలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. 



2024 మే నెలలో జరిగిన ఎన్నికలలో పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో జరిగిన పలు హింసకాండలో ప్రధాన నిందితుడు కిశోర్. ఎన్నికల రోజు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు మాచర్లలో తిరుగుతూ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి, టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డాడని తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. రెంటచింతల మండలం పాలువాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఏజెంట్గా ఉన్న నంబూరు శేషగిరిరావుపై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు. మాచర్ల పట్టణం పీడబ్ల్యుడి కాలనీలో టిడిపి నేత కేశవరెడ్డిపై దాడికి పాల్పడి పలువురిని గాయపరిచిన కేసులో నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల మరుసటి రోజు కారంపూడి పట్టణంలో టీడీపీ నేతలు, ఇళ్లు లూటీ, వారి ఆస్తులపై విధ్వంసానికి పాల్పడుతుంటే అడ్డుకున్న సీఐ నారాయణస్వామిపై దాడి చేశారు కిశోర్. ఈ కేసులో కిశోర్ ఏ2గా ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో అనుచరుడు మన్నెయ్య కోర్టులో లొంగిపోయాడు. 
Also Read: Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్