Ind Vs Aus Updates: భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ కు అవమానం జరిగింది. క్రికెట్  ఆస్ట్రేలియా (సీఏ) ప్రతినిథులు కళ్లు నెత్తికెక్కి ప్రవర్తించారు. తాజాగా ముగిసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) ప్రదానోత్సవం సందర్భంగా ఈ ఘనట చోటు చేసుకుంది. ఆదివారం భారత్ ను ఆరు వికెట్లతో ఓడించిన ఆసీస్ బీజీటీని 3-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే టోర్నీ ముగిశాక ప్రదానోత్సవ కార్యక్రమంలో కేవలం ఆసీస్ గ్రేట్ అలెన్ బోర్డర్ ను మాత్రమే పిలిచారు. అక్కడే స్టేడియంలోనే ఉన్న గావస్కర్ ను మాత్రం ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దీనిపై గావస్కర్ తాజాగా అన్ హేపీ అయ్యాడు. 


ఇండియన్ ను అనే..
భారతీయుడననే తనను చిన్న చూపు చూశారని గావస్కర్ కాస్త కలత చెందారు. నిజానికి 1997 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫిని నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు చాలా సిరీస్ లు జరిగాయి. అయితే ప్రదానోత్సవం సందర్భంగా కేవలం బోర్డర్ ను మాత్రమే పిలిచి ట్రోఫీని ఇప్పించడం వెనకాల క్రికెట్ ఆస్ట్రేలియా పైత్యం ఉందని అభిమానలు ఫైరవుతున్నారు. నిజానికి ఈ విషయపై గావస్కర్ కూడా స్పందించాడు. తనకు ఆస్ట్రేలియా గెలిచినందుకు అసంతృప్తి ఏమీ లేదని, బాగా క్రికెట్ ఆడారు కాబట్టే గెలిచారని గుర్తు చేశారు. అయినా కూడా తను అక్కడే మైదానంలో ఉన్నప్పుడు టోర్నీ ప్రదానం సందర్భంగా తనను కూడా పిలిస్తే బాగుండేదని మనసులో మాట చెప్పుకొచ్చాడు.


తను కేవలం భారతీయుడైనంత మాత్రమే ఇలా వ్యవహరించారని మండిపడ్డారు. ఆసీస్ ప్లేయర్లు ఇలా లేకిగా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో భారత్ లో చాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ట్రోఫీ ప్రదానం చేసిన అప్పటి బీసీసీఐ చీఫ్ శరద్ పవార్ ను అప్పటి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ కాస్త నెట్టివేయడం వివాదస్పదమైంది. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. 


సీఏ సన్నాయి నొక్కులు..
తాజా వివాదం చినికిచినికి గాలివానగా మారకముందే నష్ట నివారణ చర్యలకు సీఏ దిగింది. ముందే అనుకున్నట్లుగా ఏ టీమ్ గెలిస్తే ఆ టీమ్ లెజెండ్ ట్రోఫీ ప్రదానం చేస్తారని భావించామని, ఈ విషయం గావస్కర్ కు కూడా తెలిసే ఉంటుందని సన్నాయి నొక్కులు నొక్కింది. ఒకవేళ ఈ మ్యాచ్ లో భారత్ గెలిచినట్లయితే బుమ్రా చేతికి గావస్కర్ చేతితో ట్రోఫీ ఇచ్చి ఉండేవాడని పేర్కొంది. ఏదేమైనా మ్యాచ్ అఫిషీయల్స్ ఇద్దరు దిగ్గజాల చేతుల మీదుగా ట్రోఫీని ఇప్పిస్తే బాగుండేదని చావు కబురు చల్లగా చెబుతోంది.


మరోవైపు 10 ఏళ్ల తర్వాత బీజీటీని ఆసీస్ కైవసం చేసుకుంది. గత రెండు పర్యాయాలు సొంతగడ్డపైనే ఆసీస్.. భారత్ చేతిలో ఓడిపోయింది. ఈసారి మాత్రం 3-1తొ గెలుపొందింది. బోనస్ గా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లోకి వరుసగా రెండోసారి దూసుకెళ్లింది. గత ఎడిషన్ లో కూడా ఫైనల్ కు చేరిన ఆసీస్.. భారత్ ను ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. 


Also Read: Gavaskar Fires On Seniors: దేశవాళీల్లో ఇప్పటికైనా ఆడించండి - ఆడని వారిని నిర్దాక్షిణ్యంగా సాగనంపండి, కోచ్ గంభీర్‌కు గావస్కర్ సూచనలు