ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారతీయులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మ్యాచ్‌కు వేళైంది..! అయితే ఇది కోహ్లీసేన ఆడుతున్న మ్యాచ్ కాదు. అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ తలపడుతున్న పోరు. మరి భారతీయులకు ఎందుకింత ఆసక్తి? వారి గెలుపోటములతో మనకేంటి సంబంధం? రెండు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి?
మనకెందుకు ఆసక్తి?
ప్రస్తుతం అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్, భారత్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈ మూడూ సెమీస్ బెర్త్ కోసం ఎదురు చూస్తున్నాయి. టీమ్‌ఇండియా, అఫ్గాన్ నాలుగు మ్యాచులాడి రెండు గెలిచి నాలుగు పాయింట్లతో ఉన్నాయి. కివీస్ నాలుగింట్లో మూడు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు తలపడే మ్యాచులో అఫ్గాన్‌పై విజయం సాధిస్తే కివీస్ నేరుగా సెమీస్ వెళ్లిపోతుంది. కానీ పఠాన్లు వారిని ఓడిస్తే భారత్‌కు సెమీస్ అవకాశాలు నిలిచే ఉంటాయి. ఆఖరి మ్యాచులో నమీబియాను భారీ తేడాతో ఓడిస్తే మెరుగైన రన్‌రేట్‌తో నాకౌట్‌కు వెళ్లొచ్చు. అందుకే భారతీయులకు ఇంత ఆసక్తి.
ఫామ్‌లోనే కివీస్.. కానీ!
ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ కేవలం పాకిస్థాన్ చేతిలోనే ఓడిపోయింది. టీమ్‌ఇండియాపై అద్భుత విజయం అందుకుంది. అయితే అందుకు టాస్ కీలకంగా మారింది! కానీ కివీస్ మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఒకవేళ టాస్ ఓడితే మాత్రం మొదట బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అఫ్గాన్ బౌలింగ్‌లో కచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మార్టిన్ గప్తిల్ వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. నమీబియాపై టాప్ ఆర్డర్ విఫలమైనా గ్లెన్ ఫిలిప్స్, జిమ్మీ నీషమ్ అద్భుతంగా ఆడి భారీ స్కోరు చేశారు. ట్రెంట్ బౌల్ట్ వికెట్లు తీస్తున్నా అవి పవర్‌ప్లేలో రావడం లేదు. స్పిన్నర్లు ఇష్ సోధి, శాంట్నర్ దుమ్మురేపుతున్నారు. కివీస్ టాప్, మిడిలార్డర్‌ను త్వరగా ఔట్ చేస్తే అఫ్గాన్‌కు విజయావకాశాలు ఉంటాయి.
స్పిన్నే ప్రధాన బలం
ఇక అఫ్గాన్ పెద్ద జట్లకూ షాకిచ్చే స్థాయిలో ఉంది. ఆడిన ప్రతి మ్యాచులో ప్రత్యర్థిని బాగా ఇబ్బంది పెట్టింది. పాక్‌ను ఆఖరి వరకు వణికించింది. బౌలింగే ఆ జట్టు ప్రధాన బలం. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ స్పిన్‌తో మాయాజాలం చేస్తున్నారు. ముజీబుర్ పరిస్థితి తెలియడం లేదు. అతడు కోలుకొని జట్టులోకి వచ్చాడంటే కివీస్ స్పిన్‌లో ఇబ్బంది పడటం గ్యారంటీ! పేస్ బౌలింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించినా ఆఖర్లో పరుగులు ఇచ్చేస్తున్నారు. బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ ఫామ్‌లో ఉన్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ పోటీల్లో అఫ్గాన్‌ను కివీస్ రెండుసార్లు ఓడించింది. ఐతే టీ20ల్లో ఇప్పటి వరకు తలపడలేదు. ఇది రెండు జట్లకూ సమాన అవకాశాలను సృష్టిస్తోంది. ఏదేమైనా అఫ్గాన్‌కు వారికన్నా భారతీయ అభిమానుల మద్దతే ఎక్కువగా లభిస్తుండటం గమనార్హం.