తన ఆఖరి లీగు మ్యాచులో ఆస్ట్రేలియా దుమ్మురేపింది! డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీసును చిత్తు చిత్తుగా ఓడించింది. ఆ జట్టు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని మరో 22 బంతులు మిగిలుండగానే ఛేదించింది.  ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (89*; 56 బంతుల్లో 9x4, 4x6), మిచెల్‌ మార్ష్‌ (53; 32 బంతుల్లో 5x4, 2x6) చెలరేగడంతో 8 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. అంతకు ముందు విండీస్‌లో కీరన్‌ పొలార్డ్‌ (44; 31 బంతుల్లో 4x4, 1x6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఎయిన్‌ లూయిస్‌ (29; 26 బంతుల్లో 5x4, 0x6), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (27; 28 బంతుల్లో 2x4, 0x6) రాణించారు.


వార్నర్‌ అంటే ఇదీ!


తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ కావడంతో ఛేదనను ఆసీస్‌ ధాటిగా ఆరంభించింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ చెలరేగాడు. తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్ల వరద పారించాడు. జట్టు స్కోరు 33 వద్ద ఫించ్‌ (9)ని హుస్సేన్‌ ఔట్‌ చేసినా విండీస్‌కు రిలీప్‌ లేకుండా పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన మిచెల్‌ మార్ష్‌ అండతో వార్నర్‌ రెచ్చిపోయాడు. దాంతో పవర్‌ప్లేలో ఆసీస్‌ 53 పరుగులు చేసింది. వార్నర్‌ 29 బంతుల్లోనే అర్ధశతకం అందుకోవడంతో ఆసీస్‌ స్కోరు 10.1 ఓవర్లకే 100 దాటింది. మార్ష్‌ 28 బంతుల్లోనే 50 కొట్టేయడంతో ఆసీస్‌ మరింత దూకుడు పెంచింది. ముఖ్యంగా డేవీ ఒకప్పటిలా దంచికొట్టడంతో 15 ఓవర్లకే స్కోరు 150కి చేరుకుంది. గేల్‌ వేసిన 16 ఓవర్ ఆఖరి బంతికి మార్ష్‌ ఔటవ్వడంతో రెండో వికెట్‌కు 124 (75 బంతుల్లో) భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వార్నర్‌ బౌండరీ బాది గెలుపు అందించాడు.   


అదరగొట్టిన పొలార్డ్‌
 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు శుభారంభం దక్కలేదు. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి 50 పరుగులు చేసినా 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. జట్టు స్కోరు 30 వద్ద క్రిస్‌గేల్‌ (15)ను కమిన్స్‌ బౌల్డ్‌ చేశాడు. మరో ఐదు పరుగులకే నికోలస్‌ పూరన్‌ (4), రోస్టన్‌ ఛేజ్‌ (0)ను జోష్‌ హేజిల్‌వుడ్‌ (4/39)  పెవిలియన్‌ పంపించి దెబ్బకొట్టాడు. లూయిస్‌, హెట్‌మైయిర్‌ వికెట్లను అడ్డుకొని నాలుగో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం అందించారు. లూయిస్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఈ జోడీని జంపా విడదీశాడు. మరికాసేపటికే హెట్‌మైయిర్‌ను హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. స్కోరు తగ్గిన దశలో కెప్టెన్‌ పొలార్డ్‌ వరుసగా బౌండరీలు బాదేశాడు. హెట్‌మైయిర్‌తో 21, బ్రావోతో 35 పరుగుల భాగస్వామ్యాలు అందించాడు. స్కోరును 100 దాటించాడు. ఆఖరి ఓవర్లో జట్టు స్కోరు 143 వద్ద అతడిని స్టార్క్‌ ఔట్‌ చేసినా రసెల్‌ (18) రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాదేసి స్కోరును 157/7కు చేర్చాడు.


Also Read: T20 WC Standings: ఆఫ్ఘన్ పైనే భారం వేశాం.. సెమీస్‌కు ఆ దారి మాత్రమే!


Also Read: IND vs SCO, Match Highlights: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!


Also Read: NZ vs NAM, Match Highlights: సెమీస్ వైపు న్యూజిలాండ్.. నమీబియాపై భారీ విజయం


Also Read: Virat Kohli Birthday: 'కోహ్లీ.. నీ గురించి లోకానికి అరిచి చెప్పాలని ఉంది..' విరాట్‌కు అనుష్క స్పెషల్ విషెస్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి