టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 12 గ్రూప్-1 మ్యాచ్‌లు ముగిశాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో గెలిచింది. అయితే దక్షిణాఫ్రికాకి విజయానందం మిగల్లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌తో ఐదుకి నాలుగు మ్యాచ్‌లు గెలిచినా ప్రొటీస్ సెమీస్‌కు దూరం అయ్యారు. దానికి కారణం నెట్ రన్‌రేట్. గెలిచినా అవసరం అయినంత తేడాతో గెలవలేకపోవడంతో దక్షిణాఫ్రికా సెమీస్‌కు దూరం అయింది.


మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 10 పరుగులతో విజయం సాధించింది. అయినా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లాయి. దక్షిణాఫ్రికా ఇంటి బాట పట్టింది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆశించిన ఆరంభం లభించలేదు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (2: 8 బంతుల్లో) అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 15 పరుగులు మాత్రమే. అయితే మరో ఓపెనర్ క్వింటన్ డికాక్, వాన్ డర్ డుసెన్ రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో డికాక్ అవుటయ్యాడు.


అనంతరం ఎయిడెన్ మార్క్రమ్, వాన్ డెర్ డుసెన్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను వేరేస్థాయికి తీసుకెళ్లారు. వీరు అజేయమైన మూడో వికెట్‌కు కేవలం 52 బంతుల్లోనే 105 పరుగులు జోడించారు. దీంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది.


అయితే ఇంగ్లండ్ ముందు ఒకటికి మూడు టార్గెట్లు వచ్చాయి. ఒకవేళ ఇంగ్లండ్ 87 పరుగుల లోపు ఆలౌట్ అయితే.. ఇంటికి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్‌కు వెళ్తాయి. ఇంగ్లండ్ 131 పరుగుల లోపు ఆగిపోతే.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సెమీస్‌కి, ఆస్ట్రేలియా ఇంటికి వెళ్తాయి. ఇంగ్లండ్ 131 పరుగులు దాటితే.. ఫలితంతో సంబంధం లేకుండా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్తాయి.


ఇలా సమీకరణాలపై పూర్తి క్లారిటీతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మొదట తాను సెమీస్‌కు వెళ్లడంపై దృష్టి పెట్టింది. ఓపెనర్ జేసన్ రాయ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడంతో మొయిన్ అలీ క్రీజులోకి వచ్చాడు. మొదటి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 58 పరుగులు జోడించిన అనంతరం జోస్ బట్లర్ అవుటయ్యాడు. ఆ తర్వాత బెయిర్‌స్టో ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో మొయిన్, డేవిడ్ మలన్ జాగ్రత్తగా ఆడి స్కోరును 87 పరుగులు దాటించి సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు.


అనంతరం వేగంగా ఆడే ప్రయత్నంలో మొయిన్ అలీ అవుటయ్యాడు. ఆ తర్వాత లియాం లివింగ్ స్టోన్ మెరుపు లాంటి ఇన్సింగ్స్ ఆడాడు. వేగం పెంచే క్రమంలో డేవిడ్ మలన్, లియామ్ లివింగ్ స్టోన్ అవుటయ్యారు. చివరి ఓవర్లలో 14 పరుగులు చేయాల్సిన దశలో కగిసో రబడ హ్యాట్రిక్ తీసి దక్షిణాఫ్రికాను 179 పరుగులకే పరిమితం చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 10 పరుగులతో విజయం సాధించినా.. సెమీస్‌కు చేరలేకపోయింది.


Also Read: T20 WC Standings: ఆఫ్ఘన్ పైనే భారం వేశాం.. సెమీస్‌కు ఆ దారి మాత్రమే!


Also Read: IND vs SCO, Match Highlights: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!


Also Read: NZ vs NAM, Match Highlights: సెమీస్ వైపు న్యూజిలాండ్.. నమీబియాపై భారీ విజయం


Also Read: Virat Kohli Birthday: 'కోహ్లీ.. నీ గురించి లోకానికి అరిచి చెప్పాలని ఉంది..' విరాట్‌కు అనుష్క స్పెషల్ విషెస్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి