అఫ్గాన్.. ఫర్వాలేదనిపించింది! న్యూజిలాండ్ ముందు కాపాడుకోగల లక్ష్యం ఉంచింది! తొలుత బ్యాటింగ్ చేసి 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా నజీబుల్లా జద్రాన్ (73; 48 బంతుల్లో 6x4, 3x6) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడేశాడు. అతడికి గుల్బదిన్ నయీబ్ (15), మహ్మద్ నబీ (14) తోడుగా నిలిచారు. కివీస్‌లో ట్రెంట్ బౌల్ట్ 3, టిమ్ సౌథీ 2 వికెట్లు తీశాడు.
పిచ్ భిన్నంగా ఉండటంతో టాస్ గెలిచిన అఫ్గాన్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. కానీ భారీ లక్ష్యం నిర్దేశించాలన్న వారి ఆశలు నెరవేరలేదు! పవర్‌ప్లేలో 3 వికెట్లు నష్టపోయి 23 పరుగులే చేసింది. హజ్రతుల్లా జజాయ్ (2), మహ్మద్ షెజాద్ (4), రెహ్మనుల్లా గుర్బాజ్ (6) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ క్రమంలో గుల్బదిన్ నయీబ్‌తో కలిసి నజీబుల్లా జద్రాన్ అద్భుతం చేశాడు. కివీస్ పేసర్లు, స్పిన్నర్లను ఆచితూచి ఆడాడు.
ఒకట్రెండు బౌండరీలు బాదేసి ఆత్మవిశ్వాసం అందుకున్న జద్రాన్ ఆ తర్వాత ఆగలేదు. 33 బంతుల్లోనే 50 పరుగులు చేసేశాడు. జట్టు స్కోరు 56 వద్ద నయీబ్ ఔటైనా కెప్టెన్ నబీ సాయంతో జద్రాన్ రెచ్చిపోయాడు. జట్టు స్కోరు 100 దాటించాడు. ఆఖర్లో స్కోరు పెంచే క్రమంలో అతడిని బౌల్ట్ పెవిలియన్ పంపించాడు. ఆఖరి ఓవర్‌ను నీషమ్ అద్భుతంగా వేయడంతో కివీస్ 124/8కి పరిమితం అయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి