భారత బ్యాడ్మింటన్‌ హీరో కిదాంబి శ్రీకాంత్‌కు అదృష్టం కలిసిరాలేదు. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను అతడు త్రుటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అతడు ఓటమి పాలయ్యాడు. సింగపూర్‌ షట్లర్‌ లో కీన్‌ యూ చేతిలో 21-15, 22-20 తేడాతో పోరాడి ఓడాడు. రజత పతకానికే పరిమితం అయ్యాడు. మరో ఆటగాడు లక్ష్యసేన్‌ కాంస్య పతకం అందుకొన్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒకేసారి ఇద్దరు ఆటగాళ్లకు పతకాలు రావడం విశేషం.


మారిన ఆట


గతంలో కీన్‌ యూను వరుస గేముల్లో ఓడించిన అనుభవం కిదాంబికి ఉంది. 2018 కామన్వెల్త్‌ పోటీల్లో వరుస గేముల్లో అతడికి పరాజయం పరిచయం చేశాడు. అప్పటికీ ఇప్పటికీ అతడి ఆటలో ఎంతో మార్పు కనిపించింది. ఇదే ఈవెంట్లో అతడు ఒలింపిక్‌ విజేత, ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ను ఓడించాడు. దాంతో కిదాంబి, కీన్‌ పోరు ఆద్యంత ఆసక్తికరంగా సాగింది.


కీన్‌దే ఆధిపత్యం


తొలి గేమ్‌ను కిదాంబి దూకుడుగా ఆరంభించాడు. వరుసగా ఎనిమిది పాయింట్లు సాధించి 9-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో పుంజుకున్న కీన్‌ అద్భుతంగా ఆడాడు. నెట్‌ గేమ్‌, క్రాస్‌ కోర్టు షాట్లతో చెలరేగి 11-11తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి ఆట 11-11, 12-12, 14-13గా మారింది. ఇక్కడే ప్రత్యర్థి తెలివిని ప్రదర్శించాడు. వేగంగా ఆడుతూ బలమైన స్మాష్‌లు బాదేశాడు. ఆధిక్యాన్ని 18-13కు పెంచుకున్నాడు. ఆ వేగాన్ని తట్టుకోవడంలో కిదాంబి కాస్త తడబడ్డాడు. మరో రెండు పాయింట్లు సాధించినా అప్పటికే కీన్‌ 20-15తో గేమ్‌ పాయింట్‌కు చేరుకొన్నాడు. 16 నిమిషాల్లోనే 1-0తో పైచేయి సాధించాడు.


ఆఖరి వరకు వదల్లేదు


రెండో గేమ్‌ మాత్రం హోరాహోరీగా సాగింది. ఆటలో నిలవాలంటే కీలకమైన గేమ్‌ కావడంతో కిదాంబి తెలివిగా ఆడేందుకు ప్రయత్నించాడు. 7-5తో ఆధిక్యంలోకి వెళ్లినప్పుడు ప్రత్యర్థులిద్దరూ 25 షాట్ల ర్యాలీ ఆడారు. కానీ కీన్‌ వరుసగా 4 పాయింట్లు సాధించడంతో స్కోరు 10-9కి మారింది.  అలసిపోయినట్టు కనిపించినా.. కిదాంబి వరుసగా 6 పాయింట్లు అందుకొని 11-12తో నిలిచాడు. ఇక్కడే కిదాంబి 42 షాట్ల సుదీర్ఘ ర్యాలీని చక్కని క్రాస్‌కోర్టు షాట్‌తో ముగించి 16-14తో ముందుకెళ్లాడు. కానీ కీన్‌ వదల్లేదు. 18-18, 20-20తో స్కోరు సమం చేశాడు. మ్యాచ్‌ పాయింట్‌ వద్ద శ్రీకాంత్‌ ఎక్కువ ఒత్తిడికి లోనయ్యాడు. నెట్‌గేమ్‌ ఆడబోయి అనవసర తప్పిదాలు చేశాడు. దాంతో 22-20తో కీన్‌.. గేమ్‌, మ్యాచ్‌తో పాటు ఛాంపియన్‌షిప్‌ పాయింట్‌ గెలిచేశాడు.


Also Read: Kidambi Srikanth: తెలుగు తేజం మరో సంచలనం.. ఫైనల్లోకి దూసుకెళ్లిన కిడాంబి శ్రీకాంత్


Also Read: Year Ender 2021: ఈ ఏడాదీ యువరాజ్‌ దొరకలేదు..! ప్రపంచకప్పులు అందలేదు!


Also Read: IND vs SA: గబ్బర్‌ను పక్కన పెడితే అన్యాయమే! మిస్టర్‌ ఐసీసీనే పక్కన పెట్టేస్తారా?


Also Read: IND vs SA, KL Rahul: టీమ్‌ఇండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌


Also Read: Watch: ఊ.. అంటావ్‌ మామా! ఈ జింక పిల్ల గోల్‌ చూస్తే అనక తప్పదు మామా!!


Also Read: IND Vs SA: కెప్టెన్సీ రచ్చ అంతా సోషల్‌ మీడియాలోనే..! మస్తు ఎంజాయ్‌ చేస్తున్న ద్రవిడ్‌, కోహ్లీ!