కాలం గడిచే కొద్దీ భారత క్రికెట్‌ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తూనే ఉంది. అద్భుతమైన క్రికెటింగ్‌ టాలెంట్‌ను వెలికితీస్తోంది. విధ్వంసకర బ్యాటర్లు, ప్రమాదకర బౌలర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కానీ ప్రపంచకప్‌లు గెలిపించే ఆల్‌రౌండర్లను మాత్రం కాపాడుకోలేక సతమతం అవుతోంది. కాలగర్భంలో 2021 కలిసిపోతోంది. బీసీసీఐ మరొక యువరాజ్‌ సింగ్‌ను మాత్రం గుర్తించలేకపోయింది!


ఐదుగురితో నడవదు!
అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచులు గెలవాలంటే జట్టు సమష్టిగా రాణించాలి. ఐదుగురు బౌలర్ల ఫార్ములా ద్వైపాక్షిక సిరీసుల్లో బాగానే పనిచేస్తుందని అనిపిస్తుంది! ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్‌ల దగ్గరికొచ్చేసరికి తుస్సుమంటోంది! గత రెండేళ్లలో ప్రతి భారతీయుడికి ఈ విషయం అర్థమయ్యే ఉంటుంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఒక ఆల్‌రౌండర్‌ ఉండుంటే ఫలితం మరోలా ఉండేది. ఇక 2021 టీ20 ప్రపంచకప్‌లో ఈ విషయం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఐదుగురు బౌలర్ల ఫార్ములాతో టీమ్‌ఇండియా గుండెకోత మిగిల్చింది.


యువీ ఎక్కడ?
మెగా టోర్నీల్లో గెలవాలంటే ఆల్‌రౌండర్లు అత్యంత కీలకం. బౌలర్లు విఫలమైనా, అలసిపోయినా వారి భారం పంచుకుంటారు. వికెట్లు తీసి పట్టుబిగిస్తారు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్లు, టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే వికెట్లు నిలబెట్టేదీ వారే. టీమ్‌ఇండియా 1983లో తొలి ప్రపంచకప్‌ను ముద్దాడిందీ కపిల్‌దేవ్‌ వంటి నిఖార్సైన ఆల్‌రౌండర్‌ ఉండబట్టే. ఇక 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌లు వచ్చిందీ యువరాజ్‌ సింగ్‌ నిలకడ వల్లే! భారత్‌లో జరిగిన ఆ వన్డే ప్రపంచకప్‌లో యువీ 362 పరుగులు, 15 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో శతకోటి భారతీయుల ప్రాణం నిలిపాడు. తాజా టీ20 ప్రపంచకప్‌లో ఇదే లోటు కనిపించింది. బౌలర్లంతా విఫలమైతే ఆదుకొనే నాథుడు మరొకరు కనిపించలేదు.


పాండ్య దూరం
2021లోనూ టీమ్‌ఇండియా యువీ వారసులను కనుక్కోలేకపోయింది! కపిల్‌దేవ్‌ స్థాయి ఆటగాడిగా ఎదుగుతాడనుకున్న హార్దిక్‌ పాండ్య మొత్తంగా బౌలింగ్‌కే దూరమయ్యాడు. భవిష్యత్తులో బంతి పట్టేది అనుమానంగానే ఉంది. శార్దూల్‌ ఠాకూర్‌ ఇంకా పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా ఎదగలేదు. సమీకరణాల దృష్ట్యా అతడికి జట్టులో చోటు దొరకడం లేదు. అక్షర్‌ పటేల్‌ను పూర్తిగా నమ్మలేం. జడ్డూ ఈ మధ్య బ్యాటింగ్‌లో రాణిస్తున్నా గతంలో  మాదిరిగా వికెట్లు తీయడం లేదు. ఐపీఎల్‌ రెండో అంచెలో వెలుగులోకి వచ్చిన వెంకటేశ్‌ అయ్యర్‌ మాత్రం కాస్త ఆశలు రేపుతున్నాడు. బ్యాటింగ్‌లో అదరగొడుతున్న అతడు బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. మీడియం పేస్‌తో ఆకట్టుకుంటున్నాడు. అయితే అతడిని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేయాల్సిన బాధ్యత జట్టుపై ఉంది.


Also Read: Year Ender 2021: దిగ్గజాల నీడలోంచి వెలుగుతున్న సూరీడులా..! 'కెప్టెన్‌ రోహిత్‌' మర్చిపోలేని 2021


Also Read: Year Ender 2021: శాసించే స్థితి నుంచి 'కెప్టెన్సీ' పంచుకొనే స్థాయికి.. కోహ్లీకి అచ్చిరాని 2021


Also Read: IPL Media Rights Tender: బీసీసీఐకి డబ్బుల పండగ! రూ.50వేల కోట్లు వస్తాయన్న గంగూలీ.. రంగంలోకి రిలయన్స్‌?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి