21వ శతాబ్దపు క్రికెట్లో అతడో తిరుగులేని ఆటగాడు. అభిమానులు ముద్దుగా పిలుచుకొనే 'పరుగుల యంత్రం'. అతడి సెంచరీల వరద, పరుగుల సునామీ చూసి విశ్లేషకులైతే 'మానవ మాత్రుడే' కాదన్నారు! ఐసీసీ ఆ ఛేదన రారాజును ఏకంగా 'కింగ్' అని వర్ణించింది. కొద్దికాలంలోనే శిఖరపుటంచులను ముద్దాడి అత్యున్నత స్థాయిలో నిలిచిన అతడే విరాట్ కోహ్లీ! కొంతకాలంగా భారత క్రికెట్‌ను శాసించిన అతడికి 2021 వింత అనుభవాలనే మిగిల్చింది.
అంచనాలు ఇవీ
టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఈ ఏడాది ఆరంభంలో ఎన్నో అంచనాలు ఉండేవి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ అందించాలని శతకోటి భారతీయులు ఆశించారు. ఈ సారైనా కప్ ముద్దాడాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు కోరుకున్నారు. వంద పరుగులు చేసి శతకాల రికార్డులను తిరగ రాయాలని ఆశలు పెట్టుకున్నారు. కానీ అవేవీ జరగలేదు!
సారథ్యానికి గుడ్‌బై
2021లో విరాట్ అనూహ్య పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కెప్టెన్‌గా ద్వైపాక్షిక సిరీసుల్లో విజయ విహారం చేస్తున్న కోహ్లీ మెగా టోర్నీల్లో మాత్రం విఫలమవుతూనే ఉన్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో త్రుటిలో ఓటమి చవిచూశాడు. మధ్యలో కరోనాతో కొంత కాలం క్రికెట్ జరగలేదు. ఐపీఎల్ తొలి అంచెలో పరుగుల చేయకుండా అసంతృప్తి మిగిలించాడు. ఏమనిపించిందో తెలియదు గానీ ఐపీఎల్ రెండో అంచె ముందు టీ20 కెప్టెన్సీ వదిలేస్తున్నానని ప్రకటించాడు. ఆ తర్వాత ఆర్‌సీబీకీ సారథ్యం ఇదే చివరిసారని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఒత్తిడి తగ్గడంతో ఫామ్‌లోకైనా వస్తాడనుకుంటే అదీ జరగలేదు. అటు ఐపీఎల్ ఇటు ప్రపంచకప్‌లు అందించలేదు.
అనూహ్య పరిణామాలు
దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మరికొన్ని పరిణామాలు కోహ్లీకి వ్యతిరేకంగా మారాయి. వన్డే కెప్టెన్సీ చేస్తానని చెప్పినా బీసీసీఐ అతడిని సారథ్యం నుంచి తొలగించింది. రెండు రోజుల్లో చెప్పాలని ముందు వార్తలు రాగా.. గంటన్నర ముందే చెప్పారని విరాట్ అన్నాడు. ఎన్నాళ్ల నుంచో పోటీగా భావిస్తున్న రోహిత్ అతడి నుంచి టీ20, వన్డే పగ్గాలు అందుకున్నాడు. పైగా ఎంతో ఇష్టపడే కోచ్ రవిశాస్త్రి జట్టుకు దూరమయ్యాడు. అటు బీసీసీఐలోనూ అనుకూలురు లేరు. దాంతో ఆడిందే ఆట అన్న స్థితి నుంచి ఇకపై ఏం జరుగుతుందో అన్న పరిస్థితికి చేరుకున్నాడు.
గణాంకాల్లోనూ నిరాశే
ఇక ఆట పరంగానూ కోహ్లీ గణాంకాలు అంత మెరుగ్గా లేవు! ఈ ఏడాది 10 టెస్టులాడి 28.41 సగటుతో కేవలం 483 పరుగులే చేశాడు. అతడు పది టెస్టులాడిన ఏడాదిలో ఇదే అత్యల్ప స్కోరు. ఈ ఏడాది అతడు కేవలం 3 వన్డేలే ఆడాడు. 129 పరుగులు చేశాడు. టీ20ల్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. 10 మ్యాచుల్లో 74.75 సగటుతో 299 పరుగులు చేశాడు. మొత్తానికి గత రెండేళ్లుగా అతడు మూడు ఫార్మాట్లలో సెంచరీ మార్కు చేరుకోలేదు. సచిన్ వంద రికార్డుల ఘనతకు అతడింకా 30 శతకాల దూరంలో ఉన్నాడు. పాంటిగ్‌ను సమం చేసేందుకు మరో శతకం చేస్తే చాలు. మరి దక్షిణాఫ్రికా సిరీసులోనైనా అతడు మ్యాజిక్ చేస్తాడా? వచ్చే ఏడాదికి శుభారంభం చేస్తాడా?
Also Read: Ravindra Jadeja Test Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పే యోచనలో జడ్డూ..???
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి